Diabetes Foods: షుగర్ పేషెంట్స్‌కు బెస్ట్ ఫుడ్స్.. ఎలాంటి భయం లేకుండా ఇవి తినండి..!

www.mannamweb.com


Diabetes Foods: ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న జీవనశైలి వ్యాధి డయాబెటిస్ (Diabetes). దీని బారిన పడిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా ఉండవు. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధి, అంధత్వం వంటి అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ (Plant based food items) వీరికి మంచివని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శిల్పా జోషి. ఆమె ఏబీపీ లైవ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా కొన్ని మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు తినొచ్చని చెప్పారు. అవేంటంటే..

* నట్స్

బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్‌, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను అందిస్తాయి. నట్స్‌లో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఒక గుప్పెడు బాదం పప్పులు తింటే కొన్ని గంటల పాటు శక్తి లభిస్తుంది. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. వాల్‌నట్స్‌లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

* శనగలు

శనగలు (Chickpeas) పోషకాల గనులు. వీటి నుంచి ప్రోటీన్, ఫైబర్, ఐరన్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇందులోని ఫైబర్‌ కారణంగా మెటబాలిజం నెమ్మదిస్తుంది, పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ప్రోటీన్ కూడా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందుకే శనగలు తింటే ఆకలిగా అనిపించదు. ఫలితంగా ఫుడ్ క్రేవింగ్స్‌ తగ్గుతాయి.

* బెర్రీస్

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్‌బెర్రీల్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి డయాబెటిస్-ఫ్రెండ్లీ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. ఉదయం భోజనంలో కొన్ని బెర్రీలను తినవచ్చు. వీటిని సలాడ్‌కు టాపింగ్‌గా యాడ్ చేసుకోవచ్చు, స్మూతీస్‌లో కూడా కలుపుకోవచ్చు.

* విత్తనాలు

అవిసెలు (Flax seeds), చియా సీడ్స్‌, నువ్వులు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలలో ఫైబర్, మంచి కొవ్వులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ బాధితులకు అవసరమైన న్యూట్రియెంట్స్ అందిస్తాయి. అందుకే వీటిని షుగర్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. వీటిని సలాడ్స్‌, పెరుగు లేదా స్మూతీలలో యాడ్ చేసుకోవచ్చు.

* మరిన్ని ఫుడ్స్

కాలిఫ్లవర్, క్యారెట్లు, బీట్‌రూట్, టమాటాలు, ఓట్స్, క్వినోవా, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి మొక్కల ఆధారిత ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవచ్చు. అలాగే యాపిల్, నారింజ, ద్రాక్ష, పైనాపిల్, పుచ్చకాయ వంటివి కూడా షుగర్ పేషెంట్లు తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.

* ప్లాంట్-బేస్డ్‌ ఫుడ్స్ ఎలా తినాలి?

షుగర్ పేషెంట్లు తినే ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలను చేర్చడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి భోజనంలో కనీసం ఒక కూరగాయ లేదా పండు చేర్చుకోవాలి. వారానికి కొన్ని రోజులు మాంసం తినడం మానేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్స్ తినడానికి ప్రయత్నించాలి. వంటకాల్లో బాదం పాలు లేదా సోయా పాలు వంటి మొక్కల ఆధారిత పాల ఉత్పత్తులను ఉపయోగించాలి.