విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును అనుమతి కోరిన సీఎం జగన్‌

www.mannamweb.com


ఏపీలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. మే 13న ఏపీలో పోలింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకున్న జగన్ ఆ మేరకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై త్వరలో హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ జరపబోతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్న వైఎస్ జగన్ విషయంలో సీబీఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే మే 15న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది కాలంగా పూర్తి బిజీగా గడువుతున్న జగన్ కు కుటుంబంతో టైమ్ కేటాయించే అవకాశం దొరకడం లేదు. ముఖ్యంగా లండన్ లో చదువుతున్న కుమార్తెను కలిసేందుకు వీలు కావడం లేదు. దీంతో ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే లండన్ వెళ్లి కూతురిని చూసుకుని వచ్చేందుకు జగన్, భారతి దంపతులు సిద్దమవుతున్నారు.
ఈ మేరకు మే 15న గన్నవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. గతంలో సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. త్వరలో జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.