‘పోలింగ్ ముగిసింది. అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదాతలు, విద్యార్థులతో అవసరం తీరిపోయింది. ఇక వాళ్లతో పనేముంది?’ అని సర్కారు భావిస్తోంది.
అసలిస్తారా.. నొక్కేస్తారా?
అవసరం తీరిపోయిందని వదిలేస్తారా?
ఆరు పథకాల సొమ్ములు ఇచ్చేదెప్పుడు?
పోలింగ్‌కు 2 రోజుల ముందు హడావుడి
డబ్బులిచ్చేస్తామంటూ లేఖల మీద లేఖలు
నిబంధనలకు విరుద్ధమని ఈసీ బ్రేక్
పోలింగ్ తర్వాత నిధుల జమకు ఓకే
ఇప్పుడు చడీచప్పుడు చేయని ప్రభుత్వం
కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ఆసక్తి!?
నిధులు సర్దేస్తారనే అనుమానాలు
(అమరావతి – ఆంధ్రజ్యోతి)
‘పోలింగ్ ముగిసింది. అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదాతలు, విద్యార్థులతో అవసరం తీరిపోయింది. ఇక వాళ్లతో పనేముంది?’ అని సర్కారు భావిస్తోంది. ఎప్పుడో నొక్కిన బటన్‌ల డబ్బులు పోలింగ్‌కు ముందు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు… పోలింగ్ ముగిశాక ఆ మాటే ఎత్తడంలేదు. బటన్ నొక్కుడు సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ఇప్పుడు ఎలాంటి ఆటంకాలూ లేవు. పోలింగ్ తర్వాత జమ చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పుడో అనుమతి ఇచ్చింది. అయినా సరే… ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఈ సొమ్ములను అస్మదీయ కాంట్రాక్టర్లకు సర్దేస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో జనవరి 23న ఆసరా, ఫిబ్రవరి 28న కల్యాణమస్తు, షాదీ తోఫా, మార్చి 1న విద్యా దీవెన, మార్చి 6న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మార్చి 7న చేయూత, మార్చి 14న ఈబీసీ నేస్తం పథకాలకు ‘బటన్’ నొక్కారు. వీటన్నింటి విలువ రూ.14,165 కోట్లు. ఇవన్నీ డీబీటీ పథకాలే. అంటే, బటన్ నొక్కిన 24 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలి. ఏదైనా సమస్య వచ్చినా 48 గంటలు దాటొద్దు. కానీ… బటన్ నొక్కుడే తప్ప డబ్బులు జమ చేసిందే లేదు. సరిగ్గా పోలింగ్‌కు ముందు సొమ్ములు జమచేసి రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహంతో… కావాలనే జాప్యం చేశారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందు లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తామంటూ సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ అధికారులు హడావుడి చేశారు. అయితే, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని, మిగతా పార్టీలు సమానావకాశాలు కోల్పోతాయంటూ ఈసీ తిరస్కరించింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పుతో వచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని నిధులు జమ చేయాలని చూశారు. హైకోర్టు తీర్పును ఈసీకి పంపి మళ్లీ అనుమతి అడిగారు. దీనిపై ఈసీ మండిపడింది. వరుస ప్రశ్నలు సంధించి… ఎన్నికల్లో లబ్ధికోసమే డబ్బులు వేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్ధారించింది. పోలింగ్ పూర్తయిన వెంటనే… 14నే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసుకోవచ్చునని స్పష్టం చేసింది.
కష్టాలు తీరాయా?
‘‘లబ్ధిదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. వారి జీవనానికి బటన్ నొక్కుడు డబ్బులు చాలా అవసరం. ఇప్పుడు విడుదల చేయాల్సిందే’’ అని పోలింగ్‌కు ముందు సీఎస్ పదేపదే ఈసీకి లేఖలు రాశారు. సోమవారం పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి ఏ క్షణమైనా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు వేయొచ్చు. కానీ, మంగళవారం పొద్దుపోయే వరకూ ఒక్కరి ఖాతాలోనూ డబ్బు పడలేదు. మే 9న హైకోర్టు తీర్పు వచ్చిన రోజు రాత్రి కూడా తెల్లారేసరికి డబ్బులు పడిపోవాలంటూ ఆర్థిక శాఖ అధికారులు హడావుడి చేశారు. బడ్జెట్ లేదు, బీఆర్‌వోలు లేవు… తాము చేయలేమంటూ అధికారులు అడ్డంతిరిగినప్పటికీ రూ.9,600 కోట్లు చెల్లించేందుకు అంతా సిద్ధం చేశారు. టీడీపీ అడ్డం పడుతోందంటూ తీవ్రవిమర్శలు చేశారు. మరిప్పుడు ఈసీ అడ్డంకి లేదు, టీడీపీ అడ్డం పడడం లేదు మరెందుకు ఇవ్వలేదు. అసలు ఇస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎలాగూ ఎన్నికలైపోయాయి కాబట్టి… లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినా ఇప్పుడు వచ్చే రాజకీయ ప్రయోజనమేమీ లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తే కమీషన్లయినా వచ్చి పడతాయనే దిశగా ఆలోచిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పారిశ్రామిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై రగడ జరిగింది. కోడ్ అడ్డం ఉన్నందున ఇవ్వలేకపోతున్నామంటూ జగన్ చెప్పుకున్నారు. అది ముగిసి ఏడాదిన్నరయింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. ఇప్పటివరకు ఆ ప్రోత్సాహకాలు జమకాలేదు. ఇలాంటి విన్యాసాలు ఈ ఐదేళ్లలో జగన్ చాలాచేశారు. ఇప్పుడు ఆ ఆరు పథకాల నిధులనూ లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే అవకాశం లేదని అంచనా. పైగా… కోడ్ వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపులపైనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల షెడ్యూలు విడుదల నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.20వేల కోట్లదాకా బిల్లులు చెల్లించారు. కోడ్‌కు 10రోజుల ముందు రూ. 7,000 కోట్లు చెల్లించారు. అప్పుడే బటన్ నొక్కుడు డబ్బులు జమచేసే అవకాశమున్నా, ఆ పని చేయలేదు.
సిద్ధంగా రూ.7,000 కోట్లు
ఈ నెల 10వ తేదీన కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. మంగళవారం ఆర్‌బీఐలో సెక్యూరిటీలు వేలం వేసి రూ.4,000 కోట్లు అప్పు తెచ్చారు. రాష్ట్రానికి ప్రతి రోజూ వచ్చే సొంత ఆదాయం ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం వద్ద ఇప్పుడు రూ.8000 కోట్లకు పైగా డబ్బు ఉంది. అయినా… ఆ 6 పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రం ఆ నగదును ప్రభుత్వం జమ చేయడం లేదు.