ఆ 8 గంటలు జగన్ ఏం చేశారు??

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13వ తేదీన ఏం చేశారు? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కడపలోని భాకరాపురంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఆ తర్వాత ఎక్కడా మీడియాకు కనిపించలేదు. నేరుగా తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జగన్ ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఆపద్ధర్మ సీఎం స్పందించలేదా?

ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పల్నాడు, తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట… ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. దాడులు, విధ్వంసాలు జరిగాయి.

ఈ సంఘటనలు జరుగుతున్నా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేదంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఓటర్లకు సలహాలివ్వడంకానీ, సూచనలివ్వడంకానీ చేయలేదని, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి అడపా దడపా మాట్లాడి వెళ్లిపోయేవారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

బిజీగా గడిపిన చంద్రబాబు, పవన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సరళి ఎలా జరుగుతుంది? ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయి? వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు గమనించి వాటి విధివిధానాలను పరిశీలించారు. సోమవారం మొత్తం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.

నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు

పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అప్పటితో ముగియలేదు. మంగళవారం కూడా తాడిపత్రి, తిరుపతి.. తదితర ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డాయి. చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.

తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలను వెళ్లివస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా అక్కడికి తరలిరావడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. గొడవకు పాల్పడినవారిని వదిలేసి తమపై లాఠీఛార్జి చేయడంపై టీడీపీ శ్రేణులు పోలీసులకు నిరసన తెలిపాయి.