ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే.. టెన్త్ తర్వాత ఇంటర్ మీడియట్ నుంచి కష్టపడాలి. తమ పిల్లలు గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం సంపాదించి సొసైటీలో మంచి పొజీషన్ లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం వారి తాహతకు మించినప్పటికీ పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు విద్యార్థులు. ఎంసెట్ లో సీటు సాధించి ఉన్నత విద్యనభ్యసించేందుకు పునాధులు వేసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో మే 7 నుంచి 11 వ తేదీ వరకు ఇంజనీరింగ్,ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలకు దాదాపు 3.54 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 94 శాతం, అగ్రి కల్చర్ , ఫార్మసీ విభాగాలకు 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. eamcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి.. TS EAPCET 2024 Results ఆప్షన్ ని ఎంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.. TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీ రిజల్ట్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఇంజనీరింగ్ లో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఎస్ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం-పాలకొండ), సెకండ్ ర్యాంక్ హర్ష (కర్నూల్-పంచలింగాలు), మూడవ ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా (సికింద్రాబాద్-తిరుమలగిరి), నాలుగో ర్యాంక్ సందేశ్ (హైదరాబాద్ – మాదాపూర్), ఐదో ర్యాంక్ యశ్వంత్ రెడ్డి (కర్నూల్) సాధించారు. ఈసారి ఇంజనీరింగ్ లో మొదటి పది ర్యాంకుల్లో ఒక్క అమ్మాయి మాత్రమే స్థానం సంపాదించింది. అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ ప్రణీత (మదనపల్లె), రెండో ర్యాంక్ రాధాకృష్ణ(విజయనగరం), మూడో ర్యాంక్ శ్రీవర్షిణి (హనుమకొండ), నాలుగో ర్యాంక్ సాకేత్ రాఘవ్ (చిత్తూరు), ఐదో ర్యాంక్ సాయి వివేక్ (హైదరాబాద్) సాధించారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు.