T20 World Cup: సూపర్‌-8కు అమెరికా…. పాకిస్థాన్‌ ఇంటికి

www.mannamweb.com


పాకిస్థాన్‌ (Pakistan) జట్టుకు ఊహించని పరిణామం. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) నుంచి ఆ జట్టు నిష్క్రమించింది. క్రికెట్‌ పసికూన అమెరికా (America) సూపర్‌-8కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఏలో భాగంగా ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్‌ (America vs Ireland) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు.

మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు పాయింట్లు సాధించిన అమెరికా తొలిసారి సూపర్‌-8 దశకు అర్హత సాధించింది. పాకిస్థాన్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి రెండు పాయింట్లతో ఉంది. తన చివరి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో ఈ నెల 16న తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పాక్‌ గెలిచినా తన ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్‌ పాకిస్థాన్‌కి నామామాత్రపోరుగా మిగలనుంది.

మొదటి సారి సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకున్న అమెరికా.. జూన్‌ 19న దక్షిణాఫ్రికాతో, జూన్‌ 21న వెస్టిండీస్‌తో తలపడనుంది. జూన్‌ 23న B1 (ఇంగ్లాండ్‌/స్కాట్లాండ్‌) జట్టుతో తలపడనుంది. మరోవైపు గ్రూప్‌-ఏలో ఉన్న భారత్‌ ఇప్పటికే ఆడిన మూడింటిలోనూ గెలిచి సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకుంది. రేపు (శనివారం) కెనడాతో భారత్‌ తలపడనుంది.

ఇది నామమాత్రమే పోరే. ఇందులో గెలిచినా, ఓడినా ఏ ప్రభావం ఉండదు. సూపర్‌-8 పోరులో భారత్‌ ఈనెల 20న అఫ్గాన్‌తో, 22న గ్రూప్‌ D2 (బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్‌) టీమ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్‌-8కు చేరిన 8జట్లు రెండు గ్రూప్‌లుగా మ్యాచ్‌లు ఆడతాయి. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని మూడు జట్లతో పోటీ పడుతుంది. రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది.