Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త!

ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. నారా లోకేష్ కు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు.


ఈ సందర్భంగా నారా లోకేష్ తన ‘X’ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానన్నారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని గుర్తు చేశారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తానన్నారు. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చానన్నారు.

స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న తనకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానన్నారు. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానన్నారు