గత ఐదేళ్లలో భ్రష్టుపట్టిన ఆరోగ్య విశ్వవిద్యాలయం
ఎన్టీఆర్ పేరు మారుస్తున్న తెదేపా యువ నాయకులు (పాత చిత్రం)
ఆరోగ్య విశ్వవిద్యాలయం(విజయవాడ), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ మానస పుత్రికగా..
దేశంలోనే ప్రప్రథమ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అప్రతిష్ఠపాలు చేసింది. వీరవిధేయులను వీసీగా నియమించుకొని యూనివర్సిటీ పేరును దిగజార్చింది. నూతన ప్రభుత్వం వ్యవస్థను గాడిన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా రాత్రికి రాత్రి పేరు మార్చిన జగన్ ప్రభుత్వం వైద్య విద్యార్థుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. పేరు మార్పిడి వల్ల జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో వైపు జాతీయ వైద్య మండలి (ఎన్.ఎం.సి.) పేరు మార్పును సీరియస్‌గా తీసుకోకపోవడంతో విశ్వవిద్యాలయం చుట్టూ విద్యార్థులు పడిగాపులు పడ్డారు. తమకు వచ్చిన డిగ్రీ పట్టా ఎన్టీఆర్ పేరుతో ఉండగా, పీజీ డిగ్రీ పట్టా వైఎస్‌ఆర్ పేరుతో ఉండటంతో విదేశీ విశ్వవిద్యాలయాలు ఎన్నో అభ్యంతరాలు పెట్టాయి. మెడికల్, డెంటల్, ఇతర వైద్య కోర్సుల విద్యార్థులు పేరు మార్పు అవరోధాలను అధిగమించినా, నర్సింగ్ కోర్సుల పట్టభద్రులు మాత్రం అరబ్ దేశాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి ప్రైవేటు ఆస్పత్రులు సైతం వేర్వేరు పేర్లతో ఉన్న పట్టాలను అనుమతించలేదు.
వీరవిధేయుడిగా..
విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైకాపా వీరవిధేయుడిగా వ్యవహరించారు. ఆయన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వియ్యంకుడు కావడంతో పేరు మార్పునకు ఆసక్తి చూపారు. రూ.లక్షలు వెచ్చించి వాహనాల కొనుగోలు, భారీ వ్యయంతో ఛాంబర్‌కు సొబగులు, వైఎస్‌ఆర్ విగ్రహం విశ్వవిద్యాలయం ఎదుట ఏర్పాటు వంటి పనులు చేశారు. వైకాపా నాయకులతో అంటకాగడం, ఆ పార్టీ నాయకులు చెప్పినవి చేసి స్వామి భక్తి చాటుకున్నారు. ఆయన చేసిన ప్రతి పనికి రిజిస్ట్రారు, డీఆర్ అధికారులు చేదోడుగా నిలిచారు. కీలక పోస్టులో తమకు భజన చేసే వారిని నియమించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఎప్పటి నుంచో విశ్వవిద్యాలయానికి క్యాంపస్ కావాలని ప్రతిపాదనలున్నా.. సాధించుకోలేకపోయారు. కులం కార్డుతో ఉన్న ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పూలకుండీలకున్న పసుపు రంగును కూడా ఉప కులపతి మార్పించేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లను ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. వైకాపా వైద్య విభాగం ప్రతినిధినని చెప్పుకుంటున్న ఓ దంత వైద్యుడిని వెన్నంటే పెట్టుకొని విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పాగా వేసిన వెంటనే ఉపకులపతిగా ఉన్న డాక్టర్ సీవీ రావుని పదవీ కాలం ముగియకుండానే తొలగించారు. డాక్టర్ శ్యాం ప్రసాద్‌ను అందలం ఎక్కించారు. ఆయన కూడా స్వామి భక్తి చాటారు.
పేరు తొలగింపు..
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కొంతమంది తెదేపా నాయకులు విశ్వవిద్యాలయం పేరును మార్చేశారు. వైఎస్‌ఆర్ అక్షరాలను తీసివేసి ఎన్టీఆర్ అక్షరాలను ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి కూడా తొలగించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.