AP:పల్నాడు వైసీపీలో వణుకు..పిన్నెల్లి అరెస్టుతో క్యాడర్‌లో భయాందోళనలు!

www.mannamweb.com


దిశ ప్రతినిధి, గుంటూరు:పల్నాడులోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల వైసీపీ క్యాడర్‌లో రోజురోజుకూ నిరుత్సాహం ఆవరిస్తోంది. రెండు రోజుల క్రితం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత వైసీపీ పాలనలో జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలకు దిగటంతో గురజాల వైసీపీ శ్రేణులకు మతిపోయినంత పనైంది.

ఐదేళ్ల అధికారం అనుభవించి ఓడిపోగానే స్వపక్షంలో విపక్షంలా మహేష్ రెడ్డి మాట్లాడటాన్ని నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతలో బుధవారం హైకోర్టు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ తిరస్కరించటం, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయటంతో వైసీపీ క్యాడర్ లో వణుకు ప్రారంభమైంది.

ఇక ఏం చేయాలి?

ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, పిన్నెల్లి ఓటమితో కుంగిపోయిన క్యాడర్ కు ఆయనను అరెస్టు చేయటంతో భవిష్యత్తులో నియోజకవర్గంలో తమ పరిస్థితి ఏంటని ఎవరికి వారే మధన పడుతున్నారు. వైసీపీ పాలనలో పిన్నెల్లి బ్రదర్స్ తర్వాత హవా నడిపించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్, బూడిద శ్రీను, శర్మలతోపాటు మరి కొందరు పిన్నెల్లి సన్నిహితులు కౌంటింగ్ నాటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో వైసీపీ వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎవరి ఆస్తి ఎవరి పేరున మారుతుందో తెలియదు. పోలీసులు అమాయకులపై కేసులు పెట్టి హింసించడం, టీడీపీ వారిపై దాడులు చేయించడం, బాధితులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం, భారీగా దండుకోవడం జరిగాయి. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల అన్యాక్రాంతం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సొంత కార్యాలయంగా మార్చుకొని వందల సంఖ్యలో తప్పుడు రిజిస్ట్రేషన్ లు చేయించి ఎన్నో విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

వారి చర్మం ఒలిచి.. పిన్నెల్లికి చెప్పులు కుట్టిస్తా..

తురకా కిషోర్ అంటే పట్టణంలో సామాన్యులు హడలిపోయే వారు. కొద్ది నెలల క్రితం మాచర్ల పట్టణంలో వైసీపీ బహిరంగ సభలో యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి చర్మం వలిచి పిన్నెల్లి అన్నకు చెప్పులు కుట్టిస్తా అని ప్రగల్భాలు పలికారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు. బూడిద శ్రీను మాచర్ల రూరల్ మండలానికి చెందిన ఏలారు.శర్మకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ అక్రమం జరగదు అన్న పేరుంది. ఇలాంటి వారిని పెంచి పోషించిన పిన్నెల్లి భారీగా మూల్యం చెల్లించక తప్పలేదు. ప్రముఖుల అనుచరులుగా ముద్రపడిన వారందరికీ ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పోయింది. మొత్తం మీద మాచర్లలో వైసీపీ క్యాడర్ వణికిపోతుండగా గురజాలలో నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది.