ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీటీడీ నూతన చైర్మన్ ఎవరు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏపీలో వైసిపి ఓటమిపాలు కావడంతో గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత టిటిడి రేసులో అనేక మంది పేర్లు వినిపించాయి .
టీటీడీ నూతన చైర్మన్ గా అశోక్ గజపతిరాజు పేరు
ముఖ్యంగా జనసేన నాయకుడు నాగబాబు పేరు, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ పేరు, అలాగే ఓ టీవీ ఛానల్ యజమాని పేరు టిటిడి రేసులో బాగా వినిపించింది. ఇక ప్రస్తుతం టీటీడీ నూతన చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజుకు అవకాశం ఇస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎంతో కీలకమైనది.
టీటీడీ చైర్మన్ పై అందరిలో ఆసక్తి
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరంగా మారింది. అయితే అటువంటి ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవిని కేంద్ర మాజీ మంత్రి విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు అయిన అశోక్ గజపతి రాజుకు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు. విజయనగరం జిల్లాలో పార్టీని గెలిపించడానికి ఆయన కీలకంగా పనిచేశారు.
ఆయనకు టీటీడీ చైర్మన్ ఇస్తే సముచితంగా ఉంటుందన్న యోచన
సింహాచలానికి వంశ పారంపర్య ధర్మకర్తగా ఉన్న ఆయన ఉత్తరాంధ్రలో అనేక దేవాలయాలకు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండే అశోక్ గజపతిరాజుకు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. పూసపాటి అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తే ఎవరి నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదని భావిస్తున్నట్లుగా సమాచారం.
టీటీడీ ప్రతిష్టని పెంచే వారికే అవకాశం ఇవ్వాలంటున్న ఏపీ వాసులు
ఇదే కనుక నిజమైతే త్వరలోనే అశోక్ గజపతిరాజును టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా, మళ్లీ టిటిడి చైర్మన్ గానే ఆయనకు అవకాశం వస్తుందని భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా టీటీడీ ప్రతిష్టని ఇనుమడింపజేసేలా, తిరుమల శ్రీవారిని సామాన్యులకు అందుబాటులో ఉంచేలా, తిరుమలలో హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా టీటీడీ చైర్మన్ ని ఎంపిక చేయాలని ఏపీ వాసుల నుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది.