మంగళగిరి: ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు.
మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబసభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు పేదరికంలోనే పుట్టి అందులోనే చనిపోతున్నారని.. వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తామన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని చెప్పారు.
ఇప్పటి వరకు పింఛనుదారులకు రూ. 3,000 చొప్పున అందుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి రూ. 1,000 పెంచి రూ. 4,000 చేశారు. దీంతోపాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ. 1,000 చొప్పున కలిపి రూ. 7,000 నేడు పంపిణీ చేస్తున్నారు.
పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తిచేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు. అంతకుమించి ఉంటే కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది.