E-challan scam: ఈ-చలాన్ పేరిట భారీ స్కామ్.. మెసేజ్ వచ్చిందని తొందర పడ్డారో అంతే సంగతులు..

www.mannamweb.com


E-challan scam: ఈ-చలాన్ పేరిట భారీ స్కామ్.. మెసేజ్ వచ్చిందని తొందర పడ్డారో అంతే సంగతులు..

ఆన్ లైన్ మోసాలు రోజుకో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. వీటి బారిన పడి అనేక మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెక్నాలజీ బాగా పెరిగి, ప్రజలకు సులువుగా సేవలు అందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఆ టెక్నాలజీతోనే మోసాలకు పాల్పడుతున్నారు. గతంతో బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి ఓటీపీ నంబర్ల అడిగేవారు. ఆ వివరాలు చెప్పిన ప్రజల బ్యాంకు ఖాతాలో సొమ్ములను లాగేసేవారు. తర్వాత పార్సిల్ స్కామ్, డిజిటల్ అరెస్ట్ తదితర ఘటనలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఇ-చలాన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

తీవ్ర నష్టం..
ఇ-చలాన్ స్కామ్‌ లో భాగంగా మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. మీ వాహనానికి భారీ జరిమానా విధించారని, దాన్ని చెల్లించాలని అందులో ఉంటుంది. అందుకోసం నకిలీ లింక్ ను కూడా పంపిస్తారు. దాన్ని క్లిక్ చేయడం వల్ల మన డేటా చోరీకి గురవుతుంది. అలాగే జరిమానా రూపంలో డబ్బులు కూడా నష్టపోతాం.

ఇ-చలాన్ స్కామ్ అంటే..
ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉందని, దాన్ని చెల్లించాలని మనకు మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తమవుతాము. దాన్ని చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్నే సైబర్ నేరగాళ్ల తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చలానా చెల్లిచాలంటూ నకిలీ లింక్ లను పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఇలాంటి మెసేజ్ లు వస్తే అప్రమత్తంగా ఉండండి. అది నిజమా, కాదా అని ముందు నిర్ధారణ చేసుకోండి.

డ్రైవర్లే బాధితులు..
ఇ-చలాన్ స్కామ్‌ల బాధితుల్లో డ్రైవర్లు ఎక్కువగా ఉంటున్నారు. వీరికే నేరగాళ్లు ఎక్కువగా మెసేజ్ లు పంపిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల నుంచి వచ్చిన విధంగా వాటిని రూపొందిస్తున్నారు. డ్రైవర్లు సాధారణంగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించామా అనే భయంతో వారు జరిమానాలకు చెల్లించడానికి సిద్ధపడతారు.

డేటా చోరీ..
సైబర్ నేరగాళ్ల పంపిన నకిలీ మెసేజ్ ల కారణంగా తీవ్ర నష్టాలు కలుగుతాయి. దానిలోకి లింక్ ను క్లిక్ చేయగానే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్లిపోతాం. దానిలో మన క్రెడిట్ కార్డ్ సమాచారం, లాగిన్ ఆధారాలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో ఆ డేటా అంతా చోరీకి గురవుతుంది. అలాగే ఆర్థికంగా నష్టపోతాం. మన పరికరంలో మాల్వేర్ కూడా డౌన్‌లోడ్ అయిపోయే అవకాశం ఉంది. అది మన డేటాను దొంగిలించడం, మన కార్యాచరణను పర్యవేక్షించగలదు, పరికరాన్ని నియంత్రించడం చేయగలదు.

జాగ్రత్తలు తీసుకోండి..
ఇ-చలాన్ స్కామ్‌ నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలి. ముందుగా మీకు వచ్చిన మెసేజ్ లో అన్ని విషయాలను పరిశీలన చేయాలి. మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, మీరు నిబంధనలు ఉల్లంఘించారా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి.
ఆ వివరాలు లేకుంటే అది బహుశా స్కామ్ అని భాశించాలి. అలాగే మెసేజ్ లలో లింక్‌లను క్లిక్ చేయడానికి బదులుగా నేరుగా స్థానిక ట్రాఫిక్ అథారిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఎల్లప్పుడూ అధికారిక ఛానెల్‌లను ఉపయోగించాలి.
చట్టబద్ధమైన ప్రభుత్వ వెబ్‌సైట్‌లు సాధారణంగా జీవోవి.ఇన్ డొమైన్‌ను ఉపయోగిస్తాయి. కాబట్టి విభిన్న పొడిగింపులు, అనుమానాస్పద యూఆర్ఎల్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఇలాంటి అనుమానిత మెసేజ్ లు వస్తే అధికారులకు నివేదించండి.