ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు!

www.mannamweb.com


Andhra News: ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు!

వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది.

అమరావతి: వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్‌ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే.. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.

గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను రూ.20 కోట్లతో పుర, నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి. క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్‌ల ఏర్పాటు, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ కోసం రూ.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు మరో రూ.65 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్‌ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ తయారుచేస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు. వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుందని అధికారులు చెబుతున్నారు.