`వారిద్దరూ` ఉండాల్సిందే: బీసీసీఐ ముందు డిమాండ్లు పెట్టిన గంభీర్

`వారిద్దరూ` ఉండాల్సిందే: బీసీసీఐ ముందు డిమాండ్లు పెట్టిన గంభీర్


Gautam Gambhir: భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్- భారత జట్టు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. అతని నియామకాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు.

ఇదివరకే హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ పూర్తి చేసింది కూడా. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను ఇంటర్వ్యూ నిర్వహించింది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వచ్చింది బీసీసీఐకి. ఆ ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు.

ఈ రేసులో గౌతమ్ గంభీర్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం, ఐపీఎల్‌లో తాను మెంటార్‌గా ఉంటోన్న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడం ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూవీ రామన్ కంటే గంభీర్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. కొత్త బాధ్యతలను స్వీకరించడం దాదాపుగా ఖాయమైంది.

టీ20 వరల్డ్ కప్‌లో గెలిచిన జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు రాహుల్ ద్రావిడ్. అదే అతనికి చివరి బిగ్గెస్ట్ టోర్నమెంట్. అతని హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించడానికి బీసీసీఐ ఆసక్తి చూపలేదు. టీ20 వరల్డ్ కప్‌ ఫలితం తేలే సమయానికి కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను సైతం పూర్తి చేసింది. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా కూడా రాహుల్ ద్రావిడ్ ఆ పని చేయలేదు.

కాగా హెడ్ కోచ్‌గా అపాయింట్ అయినట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే గౌతమ్ గంభీర్ స్పందించాడు. తనకంటూ ఒక గుర్తింపును ఇచ్చిన ఈ దేశానికి సేవ చేయడానికి దక్కిన అతి గొప్ప అవకాశంగా అభివర్ణించాడు. కొత్త బాధ్యతలతో జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.

140 కోట్ల మంది భారతీయుల కలలను నిజం చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, చేయగలిగినదంతా చేస్తానని ప్రామిస్ చేశారు. అదే సమయంలో తన సపోర్టింగ్ స్టాఫ్ పేర్లను కూడా బీసీసీఐకి సూచించాడు గౌతమ్ గంభీర్. ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్లను తన సహాయక కోచ్‌లుగా చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.

అభిషేక్ నాయర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని గౌతమ్ గంభీర్ కోరాడు. అభిషేక్ నాయర్.. 2018 నుంచీ కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్నాడు. సికింద్రాబాద్‌లో జన్మించిన ఈ మాజీ బ్యాటర్.. రంజీల్లో ముంబై తరఫున ఆడాడు. టీమిండియా తరఫున మూడు మ్యాచ్‌లను ఆడాడు.

కర్ణాటకకు చెందిన వినయ్ కుమార్ మీడయం పేస్ బౌలర్. భారత జట్టులో మూడు ఫార్మట్లలోనూ మెరిశాడు. 31 వన్డేల్లో 38, 10 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 11, ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోచి టస్కర్స్ కేరళ, కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తరఫున రాణించాడు.