Apple Cider Vinegar: యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఇలా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు.. లేదంటే కీడ్నీలో రాళ్లు పడొచ్చు

www.mannamweb.com


యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఈ వెనిగర్ వినియోగించరు. బరువు తగ్గాలనుకునే చాలా మంది తమ ఆహారంలో యాపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకుంటారు. అయితే ఈ పానీయం పూర్తిగా ఆరోగ్యకరమా? అనే సందేహం కొందరిలో లేకపోలేదు.

యాపిల్ సైడర్ వెనిగర్ ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిని అధిక మొత్తంలో తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసుడు నీటిలో కలుసుకుని తాగాలి. అంతకు మించి డోస్ పెంచితే దుష్ర్పభావాలు తప్పవంటున్నారు నిపుణులు. ఏమవుతుందో తెలుసా?

యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఇందులో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపులో చికాకు, గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ అంత రుచిగా ఉండదు. అంతేకాకుండా, ఈ పానీయం దంతాలకు హానికరం. ఇది దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తుంది. సున్నితత్వాన్ని పెంచుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కానీ ఈ డ్రింక్ ను ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోకుండా జాగ్రత్తపడాలి. నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ సమపాళ్లలో తీసుకోకపోతే అది గొంతు చికాకుకు కారణం అవుతుంది. గొంతులో అసౌకర్యం పెరగవచ్చు. కాబట్టి ఈ డ్రింక్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఇది కండరాలు, నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. రక్తపోటు కూడా పెరగవచ్చు. శరీరంలో అలసట కూడా కనిపించవచ్చు. అలాగే మొటిమలను తగ్గించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. అయితే వెనిగర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై కాలిన గాయాలు, దద్దుర్లు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.