బడ్జెట్.. ప్రతి ఏడాది వినిపించే పదం. ఇంట్లో ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఓ అంచానా వేసుకుంటుంటారు. దాని ప్రకారం దాదాపు అన్ని అవసరాలను తీర్చుకోవచ్చు. ఇదే విధంగా దేశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందిస్తుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి వచ్చే ఆదాయం, వ్యయాలను అంచానా వేసుకుని బడ్జెట్ ను రూపొందించి పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంటారు ఆర్థిక మంత్రులు. మరి దేశ బడ్జెట్ ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఏయే అంశాలపై కేంద్రం దృష్టిపెడుతంది? ఆ వివరాల్లోకి వెళ్తే..
బడ్జెట్:
ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నది. జులై 23న ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో వార్షిక ఆర్థిక ప్రకటన అని పిలువబడుతుంది. కేంద్ర బడ్జెట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచానాల ప్రకటన. బడ్జెట్ ప్రకారంగానే ప్రభుత్వం వివిధ రంగాలపై, సంక్షేమం కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. లోక్ సభలోచర్చల అనంతరం బడ్జెట్ ఆమోదం పొందుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఎన్నికల సంవత్సరంలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టి, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే దీన్ని 2016లో ఫిబ్రవరి 01కి మార్చారు.
దేశ బడ్జెట్ ను ఎలా తయారు చేస్తారు?
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్ధాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ పలు మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులతో చర్చలు నిర్వహించి బడ్జెట్ ను రూపొందిస్తారు. సంప్రదాయం ప్రకారం హల్వా వేడుకను నిర్వహించి బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుడతారు. ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందుగానే బడ్జెట్ తయారీ ప్రారంభమవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం బడ్జెట్ ను సిద్ధం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ ద్వారా, వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడం, ఆదాయ వనరులను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అదనంగా ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రణాళికలు చేస్తుంది.
బడ్జెట్ రూపకల్పనలో మొదటగా ఖర్చులను అంచనా వేస్తారు. ఏయే రంగాలపై ఎంత ఖర్చు చేయాలనే అంచనాను తయారు చేస్తారు. రెండవ దశలో ఆదాయానికి సంబంధించిన విభాగాలు వ్యాపారస్తులు, ఆర్థిక వేత్తలు, ఇతరులతో చర్చలు జరిపి ఆయా వర్గాల అవసరాలను అంచనా వేస్తారు. మూడో దశలో, బడ్జెట్‌ను రూపొందించే శాఖల నుంచి ఆదాయ, వ్యయాల వివరాలను సేకరిస్తారు. దీని ఆధారంగా, రాబోయే సంవత్సరంలో అంచనా ఆదాయాలు – ఖర్చుల వివరాలను తయారు చేస్తారు. దీని తరువాత, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థికవేత్తలు, బ్యాంకర్లతో మాట్లాడి పన్ను మినహాయింపు అలాగే, ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ ను రూపొందించి సిద్ధం చేస్తుంది. ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.