‘మంచి’ ఈగలను తయారు చేసిన శాస్త్రవేత్తలు.. వీటి పనెంటో తెలుసా

www.mannamweb.com


సాధారణంగా ఈగలు గుర్తుకు రాగానే ఇబ్బందిగా ఫీలవుతుంటాం. గుయ్యుమంటూ అవి చేసే శబ్ధం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తులు మాత్రం ఏకంగా ఈగలను తయారు చేస్తున్నారు.

ఇంతకీ ఈగలను తయారు చేయాల్సిన అవసరం ఏముందనేగా మీ సందేహం. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటికీ చెందిన పరిశోధకుల బృందం జన్యుసవరణ చేసిన ఈగను అభివృద్ధి చేసింది. బ్లాక్‌ సోల్జర్‌ ఫ్లై పేరుతో ఈ ఈగను రూపొందించారు. ప్రపంచంలోని వ్యర్థాల సంక్షోభాన్ని పరిష్కరించేందుకే పరిశోధకులు ఈ ఈగను అభివృద్ధి చేశారు. ఈ ఈగలు సేంద్రియ వ్యర్థాల నుంచి పరిశ్రమ వ్యర్థాల వరకు అన్నింటినీ తినేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

అలాగే లూబ్రికెంట్లు, బయోఫ్యుయల్స్‌, నాణ్యమైన జంతు ఆహారపదార్థాల తయారీలోనూ ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటు చెత్తను శుభ్రం చేయటం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని, గ్రీన్‌ హౌజ్‌ గ్యాస్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్గానిక్‌ వేస్ట్‌ పేరుకుపోతోంది. ఇలా పేరుకుపోయిన వ్యర్థాల నుంచి మీథేన్‌ వాయువు ఉత్పత్తి అవుతోంది. ఇది గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు కారణమై వాతావరణాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఈగల వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ వివరాలను పరిశోధకులు కమ్యూనికేషన్స్‌ బయాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు. వీటి తయారీ వల్ల కార్బన్‌డైయాక్సైడ్‌ విడుదలను 5శాతానికి తగ్గించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఈగలతో వ్యర్థ పదార్థాలను మెరుగైన పశుగ్రాసంగా మార్చడానికి వీలు లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.