కాలిఫ్ల‌వ‌ర్‌తో ఈ స్నాక్స్ చేసి పెట్టండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు

www.mannamweb.com


సాయంత్రం స‌మ‌యంలో వేడిగా తినేందుకు స్నాక్స్ ఏమున్నాయా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే రెసిపి మీకోస‌మే. ఈ రెసిపిని చేయ‌డం చాలా సుల‌భం. ఇందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. చాలా సుల‌భంగా దీన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంత‌కీ ఈ రెసిపి ఏంటంటే.. హ‌నీ చిల్లి కాలిఫ్ల‌వ‌ర్‌. అవును, చెప్పిన‌ట్లుగానే ఈ డిష్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓ వైపు తీపి, మరోవైపు కారం రెండూ మ‌న నాలుక‌కు త‌గులుతాయి. అందువ‌ల్ల ఈ డిష్ అంద‌రికీ ఎంత‌గానో న‌చ్చుతుంది. ఇక ఈ వంట‌కాన్ని ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హనీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీడియం సైజ్ కాలిఫ్ల‌వ‌ర్ – 1 (చిన్న ముక్క‌లుగా త‌ర‌గాలి), మైదా పిండి – 1 క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – అర క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్ – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – వేయించేందుకు స‌రిప‌డా.

సాస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెజిట‌బుల్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బ‌లు – 2, అల్లం – 1 టేబుల్ స్పూన్‌, ప‌చ్చి మిర్చి – 2 లేదా 3, సోయా సాస్ – పావు క‌ప్పు, తేనె – పావు క‌ప్పు, వెనిగ‌ర్ – 1 టేబుల్ స్పూన్‌, చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్‌, ట‌మాటా కెచ‌ప్ – 1 టేబుల్ స్పూన్‌, నువ్వుల నూనె – 1 టేబుల్ స్పూన్‌, 2 టేబుల్ స్పూన్ల నీళ్ల‌తో క‌లిపి కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్‌.
గార్నిష్ కోసం..

నువ్వులు, త‌రిగిన ఉల్లికాడ‌లు, కొత్తిమీర‌.

హ‌నీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్‌ను త‌యారు చేసే విధానం..

ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌, బేకింగ్ పౌడ‌ర్‌, కొద్దిగా ఉప్పు వేసి క‌ల‌పాలి. అందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు క‌లుపుకోవాలి. చిన్నగా క‌ట్ చేసిన కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను ఆ పిండిలో ముంచి తీయాలి. ముక్క‌ల‌కు పిండి పూర్తిగా అంటుకునేలా చూడాలి. ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి మీడియం-హై మంట‌పై వేడి చేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి బంగారు గోధుమ రంగులో క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వాటిని టిష్యూ పేప‌ర్‌లోకి తీసుకుని ఎక్కువ‌గా ఉన్న నూనెను పిండేయాలి.

ఒక పెద్ద పాన్ తీసుకుని అందులో వెజిట‌బుల్ ఆయిల్ వేసి మీడియం మంట‌పై వేడి చేయాలి. అందులోనే త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అవి సువాస‌న వ‌చ్చాక అందులోనే త‌రిగిన ప‌చ్చి మిర్చి వేసి 30 సెక‌న్ల‌పాటు వేయించాలి. అనంత‌రం సోయా సాస్‌, తేనె, వెనిగ‌ర్‌, చిల్లీ సాస్‌, కెచ‌ప్ వేసి బాగా కల‌పాలి. మీకు సాస్ మందంగా కావాలంటే నీళ్లు క‌లిపిన కార్న్ ఫ్లోర్ పిండిని వేసి క‌ల‌పాలి. అనంత‌రం బాగా వేయించాలి. త‌రువాత అవ‌సరం అనుకుంటే రుచి కోసం నువ్వుల నూనె వేసుకోవ‌చ్చు.

అనంత‌రం ముందుగా వేయించి పెట్టుకున్న కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. మ‌రో 2-3 నిమిషాల పాటు అన్నీ క‌లుపుతూ బాగా వేయించాలి. దీంతో హ‌నీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్ రెడీ అవుతుంది. దీనిపై చివ‌ర్లో నువ్వులు, ఉల్లికాడ‌లు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవ‌చ్చు. దీంతో ఎంతో రుచిగా ఉండే హ‌నీ చిల్లీ కాలిఫ్ల‌వ‌ర్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ట‌మాటా సాస్ వేసి తిన‌వ‌చ్చు. తోడుగా ప‌చ్చి ఉల్లిపాయ‌, నిమ్మ‌ర‌సంతోనూ తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి.