ఏపీకి కేంద్రం నుంచి మరో శుభవార్త.. ఏకంగా రూ.7,266 కోట్లు, ఉత్తర్వులు జారీ

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో జాతీయ రహదా­రులను రూ.7,266 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 2024–25 వార్షిక ప్రణాళికను ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో కీలకమైన విజయ­వాడ తూర్పు బైపాస్‌తో మరికొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ మేరకు ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఏపీకి కేటాయించిన నిధులు.. ప్రాజెక్టుల వారీగా ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా రామారావు పేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వరకు విజయవాడ తూర్పు బైపాస్ (నాలుగు లేన్ల)‌ నిర్మాణానికి రూ.2,716 కోట్లు కేటయించారు. పల్నాడు జిల్లా వినుకొండ – గుంటూరు నాలుగు లేన్ల రహదారికి రూ.2,360కోట్లు ఇచ్చారు. విజయవాడలోని మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.669కోట్లు కేటాయించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా షీలానగర్‌ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి రూ.906 కోట్లు ఇచ్చింది కేంద్రం.

చెన్నై– కోల్‌కతా జాతీయ రహదారిపై రణస్థలం దగ్గర వదిలిపెట్టిన ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రూ.325కోట్లు కేటాయించారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని గుండు­గొలను గామన్‌ జంక్షన్‌ దగ్గర నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.150కోట్లు ఇవ్వగా.. జాతీయ రహదారి 44పై 416 కి.మీ. వద్ద అసంపూర్తిగా ఉన్న నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు రూ.140 కోట్లు కేటాయించింది కేంద్రం.

కేంద్రం కేటగిరీ వన్ జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం మొత్తం 17 రాష్ట్రాలకు రూ.71112 కోట్ల కేటాయింపునకు ఎంపిక చేసింది. ఈ నిధులు ఖర్చుపెట్టేందుకు.. మహారాష్ట్రకు అత్యధికంగా రూ.19023 కోట్ల నిధులు ఖరారు చేశారు. ఆ తర్వాత బీహార్ కు రూ.10720 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.7860 కోట్లు, ఏపీకి రూ.7226 కోట్లు కేటాయించారు. అలాగే కేటగిరీ 2 రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పలు ఉన్నాయి.. వీటిలో తెలంగాణకు రూ.5650 కోట్ల నిధులు కేటాయించారు. మొత్తానికి కేంద్రం ఇస్తున్న ఈ నిధులు ఏపీకి ప్లస్ అని చెప్పాలి.