రుచికరమైన పైనాపిల్ కేసరిని సింపుల్ టిప్స్ తో తయారు చేయండి ఇలా.. రెసిపీ మీ కోసం..

www.mannamweb.com


పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వడ్డించే స్వీట్స్ లో ఎక్కువగా పైనాపిల్ కేసరి కూడా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివిధ కార్యక్రమాల్లో దీనికి చోటు ఎక్కువే..

మృదువుగా, నిగనిగలాడుతూ, నోరూరించేలా ఉండే దీనిని ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. అయితే అద్భుతమైన పైనాపిల్ కేసరిని రుచి చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా దీనిని తినాలంటే రెస్టారెంట్స్ ను ఆశ్రయించాల్సిందే.. అయితే ఇంట్లోనే అనాస పండు, రవ్వ, నెయ్యి ఉపయోగించి క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. పైనాపిల్ కేసరిని తయారుచేయడం చాలా సులభం. దీని రంగు, రుచి మనసును హత్తుకుంటుంది. చాల మంది అనాస పండుని ఇష్టంగా తింటారు. అదే సమయంలో కొంతమంది పైనాపిల్ ను తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఈ నేపధ్యంలో పైనాపిల్ కేసరిని తయారు చేసి ఒక్కసారి తినిపిస్తే.. మేము కూడా పైనాపిల్ కేసరి అంటే గొప్ప అభిమానులమే అని అంటారు. ఈ రోజు పైనాపిల్ కేసరి తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్దాలు:

అనాస పండు (పైనాపిల్) ముక్కలు – ½ కప్పు

పైనాపిల్ గుజ్జు – ½ కప్పు

నీరు – 1 కప్పు

నెయ్యి- ¼ కప్పు

బాదం ముక్కలుగా తరిగినవి – 1 టేబుల్ స్పూన్

ఎండుద్రాక్ష – 1 టేబుల్ స్పూన్

జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్

సూజి రవ్వ- ½ కప్పు

కుంకుమ పువ్వు – ఎనిమిది రేకలు

చక్కర లేదా పంచదార పొడి – ½ కప్పు

యాలకుల పొడి- కొంచెం

పసుపు రంగు కోసం

పాలు – ఒక స్పూన్

పసుపు – చిటికెడు

పైనాపిల్ కేసరి తయారీ విధానం:

ముందుగా గ్యాస్ వెలిగించి బాణలి పెట్టండి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మీడియం మంట మీద వేడి చేయండి. ఇప్పుడు ఆ నెయ్యిలో రవ్వ వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి. వేగిన రవ్వను బాణలి నుంచి ఒక ప్లేట్‌లోకి తీసుకుని ఒక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణలిలో తరిగిన పైనాపిల్ ముక్కలను వేసి.. కొంచెం మెత్తబడే వరకు 3-4 నిమిషాలు ఉడికించాలి. తరువాత వీటిని బాణలి నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి.

షుగర్ సిరప్ కోసం బాణలిలో ఒక కప్పు నీరు వేసి మరిగించండి. అందులో కుంకుమపువ్వు రేకలు వేసి అందులో చెక్కెర లేదా పటికబెల్లం పొడిని జోడించండి. చెక్కెర లేదా పటికబెల్లం పొడి పూర్తిగా కరిగిపోయే వరకూ తిప్పుతూ ఉండాలి. అనంతరం ఈ షుగర్ సిరప్ లో తీసుకున్న పైనాపిల్ గుజ్జుని వేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్యాస్ మంటను తగ్గించి ఈ మిశ్రమంలో వేయించిన రవ్వను కొంచెం కొంచెం ముద్దలు ఏర్పడకుండా కలుపుతూ వేయాలి. ఈ మిశ్రమం మొత్తం ఉడికే వరకూ కదుపుతూ ఉండాలి. నీరు తగ్గి చిక్కబడే వరకు ఉడికించండి. ఇప్పుడు పాలల్లో పసుపు కలిపి మిశ్రమాన్ని బాగా కదపండి.

మరో స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి వేడి చేసి నెయ్యి వేసి తరిగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించాలి. వీటిని నెయ్యితో పాటు ఉడికించిన మిశ్రమంలోకి వెయ్యాయి. ఇప్పుడు పైనాపిల్ కేసరిని తక్కువ మంట మీద మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యలాకుల పొడిని జోడించండి. అంతే టేస్టీ టేస్టీ పైనాపిల్ కేసరి స్వీట్ రెడీ.. పిల్లలకు పెద్దలకు కొంచెం వీడిగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి.. విడిచి పెట్టకుండా తినేస్తారు.