డిక్లరేషన్‌పై మీడియా ప్రశ్న.. షర్మిల సమాధానం ఇదే..

www.mannamweb.com


తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని సమాధానమిచ్చారు. ‘‘రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్’’ అని ఏపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ (Former CM YS Jagan) తిరుమల పర్యటన, డిక్లరేషన్‌ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ?(APCC Chief YS Sharmila) స్పందించారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని సమాధానమిచ్చారు. ‘‘రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్’’ అని ఏపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.

సాక్షాలు ఉన్నా.. చర్యలేవి…

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ పశ్చాత్తాప దీక్ష , మాజీ సీఎం జగన్ ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఒకరిపై పోటీ పడి నీచ మైన మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సర్కారు తిరుమల లడ్డూను కల్తీ చేసిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో మార్కెట్ కంటే తక్కువకే జగన్ సర్కారు నెయ్యి కొనుగోలు చేసిందన్నారు. లడ్డూలకు వాడే నెయ్యిలో జంతు కొవ్వులు ఉన్నాయని ల్యాబ్‌లోనూ నిర్దారించారని తెలిపారు. నెయ్యి కల్తీ జరిగిందనే విషయం చంద్రబాబుకు తెలుసని.. సాక్ష్యాలు, రిపోర్టులు ఉన్నా చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

బీజేపీ ఉద్దేశమదే…

హిందూ మతంపై దాడి అని బీజేపీ మాట్లాడుతోందని… చర్చిలు, మసీదుపై దాడి జరిగితే ఇలాగే ఉంటారా అని పవన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు పెంచే ఆలోచన కూటమి నేతలకు ఉందా అంటూ ఏపీసీసీ చీఫ్ నిలదీశారు. మతాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఉద్దేశమని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు. కేంద్ర మంత్రులు కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. సెంటిమెంట్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నప్పటికీ ప్రధాని మోదీ కనీసం ఎందుకు స్పందించడం లేదని అడిగారు. కనీసం సీబీఐ విచారణ జరగాలని మోదీకి ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు.

సీజేఐకి లేఖ రాశా..

రెండు నెలలైనా విచారణకు ఎందుకు ఆదేశించలేదన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ మతంపై నిజంగా కుట్ర జరిగితే సీబీఐ దర్యాప్తులో తేలేది కదా అని అన్నారు. రెండు నెలల ముందే సిట్ వేసి ఉంటే రచ్చ జరిగేదే కాదు కదా అని అన్నారు. చంద్రబాబు, పవన్, జగన్ అంతా కలసి నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మతోన్మాద చర్యలు అవసరం లేదన్నారు. తిరుమల వ్యవహారంలో సవాళ్లు, దీక్షలు,ప్రమాణాలు అవసరం లేదన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటన విషయమై ప్రజలకు నిజం తెలియాలన్నారు. తిరుమలలో మళ్లీ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సీజేఐని కోరామన్నారు.