తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. వాట్సాప్, టెలిగ్రామ్, ఆన్ లైన్ లో టీడీపీ మెంబర్ షిప్ పొందవచ్చు. అలాగే రెన్యువల్ చేసుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26 ప్రారంభమైంది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తన సభ్యత్వాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెన్యువల్ చేసుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి తన సభ్యత్వాన్ని సీఎం పునరుద్ధరించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుంచి టీడీపీ సభ్యత్వం రెన్యువల్ కార్డును చంద్రబాబు అందుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు..అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో సభ్యత్వ నమోదు చేయించుకున్న తెలంగాణ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రుసుము ఒక రూపాయి నుంచి ఆరంభమై నేడు 100 రూపాయలకు చేరిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ మెంబర్ షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు.
“అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. కొన్ని కుటుంబాలకు పరిమితమైన అధికారం పదవులను అందరికీ అందేలా చేసింది టీడీపీ. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని కమిటీలను నియమించాం. ప్రమాదాలు, ముఠా కక్షలకు కార్యకర్తలు బలైతే.. వారి పిల్లలను చదివించేందుకు ఒక స్కూల్ ఏర్పాటుచేసి, స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న పార్టీ తెలుగుదేశం” – సీఎం చంద్రబాబు
రూ.100 లతో రూ.5 లక్షల ప్రమాద బీమా
టీడీపీ సభ్యత్వం నమోదులో రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి.. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని రూ.5 లక్షలకు పెంచారు. అలాగే టీడీపీ సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి మరణించిన రోజే అంత్యక్రియలకు రూ.10 వేలు అందించనున్నారు. దీంతో పాటు కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
సభ్యత్వ నమోదు ఎలా?
టీడీపీ సభ్యత్వాన్ని మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి… వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు.