70 ఏండ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
ఆదాయం, సామాజిక స్థితి, వృత్తితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్
70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వృద్ధులకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ఓ ఆరోగ్య సంజీవనిగా మారింది.
2018లో తీసుకొచ్చిన ఈ పథకం ప్రయోజనాలను 70 ఏండ్లు పైబడిన వృద్ధులకు కూడా వర్తింపజేసేలా ఇటీవలే మార్పులు చేశారు. తాజా నిర్ణయంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాల్లో ఉన్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరే వెసులుబాటు కలిగింది. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమా (ఏబీపీఎంజేఏవై-సీనియర్ సిటిజన్) పథకంపై సమగ్ర వివరాలు..
ఏమిటీ పథకం?
దేశంలో 70 ఏండ్లు, ఆపైబడిన వయసు వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వడమే ఏబీపీఎంజేఏవై-సీనియర్ సిటిజన్ స్కీమ్ లక్ష్యం.
ఎవరు అర్హులు?
ఈ పథకంలో చేరడానికి ఆర్థిక స్థోమత, సామాజిక స్థితి, వృత్తి ఇలా ఏ అంశాలనూ పరిగణనలోకి తీసుకోరు. 70 ఏండ్ల వయసు పైబడిన పురుషుడు, మహిళ ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు.
ఏయే పత్రాలు సమర్పించాలి?
వయసు ధ్రువీకరణ కొరకు ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు. మరే ఇతర పత్రాలు అవసరం లేదు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
https://beneficiary. nha.gov.in/ పోర్టల్ ద్వారా పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ఆయుష్మాన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
పథకంలో చేరినట్టు రుజువేంటి?
పథకంలో చేరినవారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ వయ వందన కార్డును అందజేస్తారు. డిజిటల్ కార్డులూ అందుబాటులో ఉన్నాయి.
ఎక్కువ మంది ఉంటే నమోదు ఎలా?
ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత ‘యాడ్ మెంబర్’పై క్లిక్ చేసి మరొకరి వివరాలను నమోదు చేయాలి. ఒక్కొక్కరికి వేర్వేరుగా నమోదు చేయనక్కర్లేదు.
కుటుంబంలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటే?
ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది అర్హులైన వృద్ధులు ఉంటే, వారంతా కలిసి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం చేకూరుతుంది. అంటే, కుటుంబానికి రూ.5 లక్షల వరకు మాత్రమే లబ్ధి పొందడానికి వీలవుతుందన్న మాట.
ఇప్పటికే కుటుంబం ఆయుష్మాన్ స్కీమ్‌లో నమోదై ఉంటే?
ఇప్పటికే ఆయుష్మాన్ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లో 70 ఏండ్లు, ఆ పైబడిన వారుంటే.. వారికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది.
ఈ స్కీమ్‌లో ఎన్ని దవాఖానలు ఎన్‌రోల్ అయ్యాయి?
నవంబర్ 1 వరకు ఉన్న డాటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 16,691 ప్రభుత్వ దవాఖానలు, 13,078 ప్రైవేటు దవాఖానలు ఈ పథకం కింద నమోదయ్యాయి.
స్కీమ్ మళ్లీ మార్చుకోవచ్చా?
ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం నుంచి వైదొలగి, ఏబీపీఎంజేఏవైలో చేరినవారు మళ్లీ ఆ ప్రభుత్వ ఆరోగ్య పథకానికి వెనక్కి మారడానికి వీలుండదు. ఏబీపీఎంజేఏవైలోనే కొనసాగాల్సి ఉంటుంది.
ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి?
ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా (ఈఎస్‌ఐ) పథకం కింద ప్రయోజనం పొందుతున్న వారు వాటిని కొనసాగిస్తూనే ఈ పథకంలోనూ చేరొచ్చు. అలా అదనంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా ప్రయోజనం పొందొచ్చు.
చేరిన వెంటనే చికిత్స పొందవచ్చా?
పీఎంజేఏవై పథకంలో చేరిన మొదటి రోజు నుంచే చికిత్స పొందడానికి అర్హులు. చికిత్స కోసం వెయిటింగ్ పీరియడ్ నిబంధన లేదు. కాబట్టి ఈ బీమా కవరేజ్ తక్షణమే ప్రారంభమవుతుంది.
ఎన్ని రకాల చికిత్సలు అందుబాటులో?
డయాలిసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఆర్ధోపెడిక్ సర్జరీల వంటి 1,949 మెడికల్ ప్రొసీజర్లు, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 మెడికల్ స్పెషాలిటీలతో పాటు 750కి పైగా అరుదైన చికిత్సలు ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి.
ఏమైనా డబ్బులు చెల్లించాలా?
ఈ పథకం పూర్తిగా నగదు రహితమైనది. స్కీమ్ కవరేజీ కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలో పేరును నమోదు చేసుకొని ఒక్క పైసా కూడా చెల్లించకుండా వైద్య సేవలను పొందొచ్చు. ఏదైనా చికిత్స కోసం దవాఖానలో చేరే అవసరం ఏర్పడితే, మూడు రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్ (కన్సల్టెన్సీ ఫీజు, టెస్టులు)తో పాటు 15 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా ఈ స్కీమ్ పరిధిలోకే వస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగుల మాటేమిటి?
సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీమ్, ఈసీహెచ్‌ఎస్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల కింద ఉన్న వయో వృద్ధులు వాటిని కానీ, ఏబీపీఎంజేఏవైని కానీ ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
టెస్టులు, మందుల మాటేమిటి?
వైద్య సేవల్లో భాగంగా నిర్వహించే టెస్టులు, మందులు కూడా ఈ స్కీమ్ కింద ఉచితంగానే ఇస్తారు. ఇంకా.. ఈ స్కీమ్ పరిధిలో ఏయే సేవలు ఉచితంగా అందుతాయంటే??
మెడికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ కన్సల్టేషన్, ఓటీ, సర్జన్ ఫీజు, ట్రీట్మెంట్
ప్రీ-హాస్పిటలైజేషన్ (3 రోజులు)
మందులు, మెడికల్‌కు సంబంధించిన వస్తువులు
ఐసీయూ, నాన్-ఐసీయూ
డయాగ్నోస్టిక్స్ అండ్ లాబోరేటరీ ఇన్వెస్టిగేషన్స్
మెడికల్ ఇంప్లాంటేషన్ సర్వీసులు
రూమ్ ఫెసిలిటీ (వసతి)
ఆహారం
చికిత్స సమయంలో తలెత్తే ఆరోగ్య సమస్యలు
పోస్ట్-హాస్పిటలైజేషన్ (15 రోజులు)