తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో, చైర్మన్
ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు
తనకేమీ చెప్పడంలేదని ఆగ్రహం.. చెప్పనిదేంటంటూ ఈవో ధ్వజం
సీఎం, మంత్రుల ముందే ఇద్దరి రచ్చ..
తొలుత మంత్రి అనగాని జోక్యం
ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు.. ఇదేం పద్ధతి… ఇద్దరూ ఆపండి
సమన్వయంతో పని చేయలేరా? అంటూ ఇద్దరికీ సీఎం హెచ్చరిక
అది… స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్, ఈవో సంయమనం కోల్పోయారు. విచక్షణ మరిచారు. ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారు. ‘నువ్వు నాకేం చెప్పడంలేదు’ అని చైర్మన్ బీఆర్ నాయుడు… ‘అన్నీ చెబుతూనే ఉన్నాం’ అని ఈవో శ్యామలరావు పరస్పరం వాదనకు దిగారు. కొద్దిసేపు సంయమనం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తర్వాత వారిద్దరిపై మండిపడ్డారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధితులను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. పరామర్శల అనంతరం తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి(ఈఓ) శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి అనిత తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులు కూడా ఈ భేటీకి వచ్చారు. టీటీడీలో ‘ఉన్నతస్థాయి’ వ్యక్తుల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయాన్ని నిజం చేస్తూ… చైర్మన్, ఈవోలు పరస్పరం తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ”ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదు.
చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు. ఏ చిన్న విషయాన్నీ నాతో చర్చించడం లేదు. మీరైనా కాస్త చెప్పండి” అని చంద్రబాబుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. ‘నీకేం చెప్పడంలేదు. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా’ అంటూ చైర్మన్‌పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరూ ‘నువ్వు’ అంటే ‘నువ్వు’ అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు, సీఎం విస్మయానికి గురయ్యారు. ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని… ఈవోను మందలించారు. ”ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి మన అందరికీ బాస్. ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా? శ్రీవాణి ట్రస్టులో అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి. ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు!” అని అభ్యంతరం తెలిపారు.
చంద్రబాబు జోక్యం చేసుకుని ‘సత్యప్రసాద్ నువ్వు ఆగు’ అంటూ… ఈవో, చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ”ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా పద్ధతి? మీ పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు. మీ ఫ్రస్టేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు? అసలిక్కడ జరిగిందేమిటి? మీరు మాట్లాడుతున్నదేమిటి? ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఓపిక, సమన్వయం ఉండాలి. అది మీకు ఎందుకు సాధ్యపడటం లేదు? నేనూ, చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా? మేం కోఆర్డినేషన్‌లో లేమా? ఒకరితో మరొకరం మాట్లాడుకోవడం లేదా? ఇద్దరం కలిసి పనిచేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఇలా కొట్టుకుంటే ఎలా? ఇదేం భాష? ఇదేం వ్యవహారం. ఇది పద్ధతిగా లేదు. వెంటనే ఆపండి” అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహారశైలి కూడా ప్రస్తావనకు వచ్చింది. ”వాటన్నింటిపై తర్వాత మాట్లాడదాం. ఇది సందర్భం కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం. కానీ మీ పద్ధతి మార్చుకోవాలి. సమన్వయంతో పని చేయాల్సిందే” అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.