Another New District in AP : ఏపీలో మరో కొత్త జిల్లా..

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటు అంశం చర్చనీయాంశమైంది. గతంలో 13 జిల్లాలను 26కి పెంచిన ప్రభుత్వం, తాజాగా మార్కాపురాన్ని (Markapuram) ప్రత్యేక జిల్లాగా చేయాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ప్రత్యేకంగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఈ అంశంపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటనలు చేశారు.

మార్కాపురంలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం రాజకీయ దృష్ట్యా కీలకంగా మారింది. మార్కాపురం అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని, ప్రత్యేక జిల్లాగా మారేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. మార్కాపురం ప్రాంతంలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంపై మంత్రులు ప్రాముఖ్యతనిచ్చారు. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపి, మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలతో కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన గూడేలకు విద్యుత్తు సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు అమలు చేయడంపై కృషి చేస్తామని చెప్పారు. మార్కాపురం కొత్త జిల్లా అంశంపై ప్రభుత్వ దృష్టి సారించడం ప్రజలలో ఆసక్తి రేపుతోంది. ఈ జిల్లాపై తీసుకున్న నిర్ణయం, అభివృద్ధి ప్రణాళికలు మార్కాపురం ప్రజలకు అనేక అవకాశాలను అందించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.