పార్ట్‌టైం చేస్తే ఇంటికే!

అమెరికాలో విద్యార్థులకు డిపోర్టేషన్‌ ముప్పు


చదువు పేరుతో వెళ్లి ఉద్యోగం చేసేవారిపై

నిఘా పెట్టి పట్టుకుంటున్న అధికారులు

పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపుతూ ఆదేశం

వారం రోజులుగా పార్ట్‌ టైం జాబ్‌లకు డుమ్మా

అక్కడి భారతీయ వ్యాపారులపైనా ప్రభావం

అమెరికాలోని మిషిగన్‌ స్టేట్‌లో.. ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌ బయట అనధికారికంగా పనులు చేస్తుండడమే ఇందుకు కారణం. క్యాంపస్‌ నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారన్న దానిపై మూడు రోజులపాటు నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. అనంతరం వారి సెవిస్‌ (విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్య)ను రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఖర్చుల కోసం పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మిషిగన్‌లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతేకాదు.. వీరితో పని చేయించుకుంటున్న భారత్‌కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నికయ్యాక తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇది.. అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మాస్టర్స్‌ పూర్తయి ఓపీటీ సమయంలో ఉన్నవారి పరిస్థితి ఎటూ తోచకుండా ఉంది.

ఎఫ్‌-1 వీసాదారుల్లో గుబులు..

ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చేవారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2లక్షల ఎఫ్‌-1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 40 శాతం భారతీయులకే కేటాయిస్తోంది. 2024లోనూ అమెరికా దాదాపు 84 వేల మంది భారతీయులకు ఎఫ్‌-1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది. ఇలా ప్రతి ఏటా ఇక్కడి నుంచి 25-30 వేల మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫుల్‌ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకుని.. విద్యను పక్కనబెట్టి అక్కడ పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఎఫ్‌-1 వీసాపై వచ్చి పార్ట్‌ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్న వార్తలతో పార్ట్‌టైం, ఫుల్‌ టైం ఉద్యోగాలు చేస్తున్న ఎఫ్‌-1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడి రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్నారు.

ఉద్యోగం చేస్తూ పట్టుబడితే ఇంటికే..

ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయడం సాధారణంగా మారింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పార్ట్‌ టైం, ఫుల్‌ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మద్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ఇక భవిష్యత్తులోనూ అమెరికా వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో ఈ భయం ఎఫ్‌-1 వీసాదారుల్లో ఎక్కువగా నెలకొంది. అలాగే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక.. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)కు అవకాశం ఇస్తారు. ఇది కోర్సులను బట్టి 12-36 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసేందుకు హెచ్‌-1బీకి అర్హత లభిస్తుంది. ఓపీటీ గడువు పూర్తయ్యాక ఐ-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్‌ కార్డ్‌ వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇలా.. ఓపీటీలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 2లక్షల మందికిపైగా ఉంటారని అంచనా. కానీ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గ్రీన్‌ కార్డ్‌ రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. దీనికోసమే అక్కడ ఓపీటీ చేస్తున్న వేలాది మంది విద్యార్థుల్లో తాజా పరిణామాలు నిరాశకు గురి చేస్తున్నాయి.

భారతీయ వ్యాపారులపైనా ప్రభావం..

ట్రంప్‌ సర్కారు నిర్ణయం.. ఇటు విద్యార్థులతోపాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయుల పైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు తమ ఖర్చుల కోసం ఏదో ఒక పనిని తక్కువ వేతనానికే చేసేందుకు సిద్ధంగా ఉంటారు. పైగా ఎన్ని గంటలైనా అభ్యంతరం చెప్పకుండా పనిచేస్తారు. దీంతో అక్కడ వ్యాపారం చేసుకునే భారతీయులు ఎక్కువగా వీరినే తమ పనిలో పెట్టుకుంటుంటారు. కానీ, పని చేస్తూ పట్టుబడితే మొదటికే మోసం జరిగే ప్రమాదం నెలకొనడంతో వ్యాపారులు కూడా ఆ విద్యార్థులను పనిలోకి పిలవడంలేదు. ఫలితంగా అమెరికాలో భారతీయ వ్యాపారాలు కూడా దెబ్బతినవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు అమెరికా-ఇండియా ఒక్కటే

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.