వైసీపీ పార్టీ ని అంటిపెట్టుకొని ఇన్ని రోజులు ఆ పార్టీ ని అన్ని సందర్భాల్లో మోస్తూ, మాజీ సీఎం జగన్ కి, పార్టీ క్యాడర్ కి అండగా నిలుస్తూ వచ్చిన ముఖ్య నాయకులందరూ ఒక్కొక్కరిగా ఇప్పుడు ఆ పార్టీ ని వదిలి వెళ్లిపోతుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.
కాసేపటి క్రితమే విజయ్ సాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి ముఖ్య నాయకులు ఆ పార్టీ కి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వైవీ సుబ్బా రెడ్డి కూడా చేరబోతున్నాడని టాక్. ఈయన కూడా పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో వైవీ సుబ్బారెడ్డి ఒకడు. సీఎం జగన్ కి గుండె లాంటి వాడు. అలాంటి వ్యక్తి కూడా రాజీనామా చేయడం సంచలనం గా మారింది.
రీసెంట్ గానే ఈయనని వై ఎస్ జగన్ రాజ్య సభకి పంపించాడు. అంతే కాకుండా గత ప్రభుత్వం లో ఆయన టీటీడీ కి చైర్మన్ గా కూడా వ్యవహరించాడు. తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి వాడారు అనే ఆరోపణలు వస్తున్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి బయటకి వచ్చి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కావాలనే విష ప్రచారం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ లడ్డు వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. గత కొద్దిరోజులుగా ఈ కేసు విషయంలో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా ఆయన తప్పు చేసినట్టు ఏమైనా ఆధారాలు బయటకి వచ్చాయా?, అందుకే కనీసం వైసీపీ పార్టీ కి దూరంగా ఉంటే తనని ఏమి చేయరు అనే భావన తో ఆ పార్టీ కి రాజీనామా చేయాలనీ అనుకుంటున్నాడా? అనే అనుమానం కలుగుతుంది.
ఇదంతా పక్కన పెడితే మాజీ సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని, ఈ విషయం అర్థం అవ్వబట్టే వైసీపీ పార్టీ ఒక్కసారిగా పేక మేడలాగా కూలిపోతుందని మరికొంత మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆ పార్టీకి అకస్మాత్తుగా ఇలాంటి కోలుకోలేని షాక్ తగలడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా లో తోటి కార్యకర్తలకు మనో ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నాయకులను చూసి జనాలు ఓట్లు వేయలేదని, కేవలం జగన్ ని చూసి వేశారని, ఊరు పేరు తెలియని వాళ్ళని కూడా నిలబెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించగల శక్తి జగన్ కి ఉందని అంటున్నారు.
































