ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్‌కార్ట్ (Lenskart) స్మార్ట్ గ్లాసెస్‌ను లాంచ్ చేసింది. సాధారణ కళ్లద్దాల మాదిరిగా వీటిని వాడుకొనేలా తీర్చిదిద్దడంతో పాటు దీనికి కొన్ని స్మార్ట్ ఫీచర్లను జోడించింది. కాల్స్ మాట్లాడుకోవడం, మ్యూజిక్ వినడం, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. లెన్స్‌కార్ట్ ఫోనిక్గా పిలిచే ఈ స్మార్ట్‌గ్లాసెస్ ధరను రూ.4వేలుగా కంపెనీ నిర్ణయించింది. లెన్స్‌కార్ట్ వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ప్రిస్క్రిప్షన్కు అనుగుణంగా లెన్సులు గానీ, సన్ గ్లాసెస్‌గా గానీ వీటిని వాడుకునేలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎంచుకున్న లెన్సును బట్టి ధరలో మార్పు ఉంటుంది. మ్యాటీ బ్లాక్, షైనీ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
ఇక స్మార్ట్ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ గ్లాసులు బ్లూటూత్ ఆడియోతో వస్తున్నాయి. మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని చెవి భాగంలో అమర్చిన ఇన్‌బిల్ట్ స్పీకర్ ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చు. కాల్స్ కూడా మాట్లాడొచ్చు. సింగిల్ ఛార్జింగ్‌తో ఏడు గంటల పాటు ప్లే బ్యాక్ టైమ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. వాయిస్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉంది. తద్వారా ఆండ్రాయిడ్/ ఐఓఎస్ డివైజులకు కమాండ్స్ పంపించి మెసేజులు పంపించుకోవచ్చు. రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఆపరేట్ చేయడానికి ఓ చెవి భాగంలో ఓ స్మార్ట్ బటన్ ఇచ్చారు. బాక్సుతో పాటు ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది.
































