ఈ రోజుల్లో గుండె పోటుతో కుప్పకూలిపోతున్న మనుషుల ప్రాణాలను టెక్నాలజీ సమర్థవంతంగా రక్షిస్తోంది. పెరిగిపోతున్న గుండె జబ్బుల మధ్య, గుండెను కాపాడే సరికొత్త వైద్య పరికరాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఫౌంటెన్ పెన్ను సైజులో ఉండే ఒక చిన్న హార్ట్ పంపు, (Heart Pump) బలహీనమైన గుండెలకు ఇప్పుడు నిజంగానే ఒక వరంలా మారింది. ఇంపెల్లా 5.5 (Impella 5.5) అనే ఈ డివైజ్ ఇప్పటికే ఎంతోమంది పెద్దల ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు పిల్లల కోసం కూడా వాడేందుకు FDA అనుమతి లభించడంతో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారి రోగులకు కొత్త ఆశలు చిగురించాయి.
ఇంపెల్లా సహాయంతో ప్రాణాలు నిలబెట్టుకున్న వారిలో 21 ఏళ్ల కత్రీనా పెన్నీ ఒకరు. పుట్టుకతోనే గుండె లోపాలతో బాధపడిన ఆమెకు 19 ఏళ్ల వయసులో గుండె మార్పిడి శస్త్రచికిత్స (Heart transplant) జరిగింది. కానీ దురదృష్టవశాత్తు, రెండేళ్లకే ఆమె కొత్త గుండె కూడా పనిచేయడం ఆగిపోయింది. ఆ సమయంలో, ఇంపెల్లా అనే ఈ చిన్న పంపు ద్వారానే ఆమె గుండె ఐదు వారాలపాటు పనిచేసింది. మళ్లీ డాక్టర్లు మరో గుండెను సంపాదించే వరకు ఈ పంపు సదరు యువతిని కాపాడింది. “ఇది నా గుండె చేయాల్సిన పని మొత్తం చేసింది,” అని కత్రీనా CBS ఫిలడెల్ఫియా ఛానెల్‌తో చెప్పింది. “ఇది 100% నా ప్రాణాల్ని కాపాడింది. అందుకే నేను నా ఇంపెల్లాకి ‘ఎల్లా’ అని పేరు కూడా పెట్టుకున్నాను.” అని కత్రీనా సంతోషంగా తెలిపింది.
* ఇంపెల్లా 5.5 ఎలా పనిచేస్తుంది?
ఇంపెల్లా 5.5 ప్రపంచంలోనే అతి చిన్న హార్ట్ పంపు (smallest heart pump). గుండెకు అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా మద్దతు ఇవ్వడానికి దీన్ని రూపొందించారు. గుండెకు విశ్రాంతినిచ్చి, కోలుకునేలా చేస్తుంది. డాక్టర్లు గుండెకు ఆపరేషన్ చేయకుండానే దీన్ని అమర్చగలరు. అందుకే ఇది చాలామంది రోగులకు ఇదొక సేఫ్ ఆప్షన్.
* ముఖ్యమైన ఫీచర్లు, ప్రయోజనాలు
ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఇంపెల్లా 5.5 గుండె చేసే పనిని కొంతమేరకు తీసుకుంటుంది. ఇది గుండెపై భారం తగ్గిస్తుంది, తద్వారా గుండె శరీరమంతా రక్తాన్ని సులువుగా పంప్ చేయగలదు. ముఖ్యంగా ఎడమ జఠరిక (Left ventricle) పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కార్డియోజెనిక్ షాక్ (cardiogenic shock) వంటి ప్రాణాంతక పరిస్థితుల్లో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెపోటు, గుండె ఆపరేషన్లు, లేదా గుండె పూర్తిగా బలహీనపడినప్పుడు ఈ షాక్ వస్తుంది. అలాంటి సమయాల్లో ఇంపెల్లా ఒక ప్రాణదాతలా పనిచేస్తుంది.
సాధారణ గుండె పంపుల్లా కాకుండా, ఇంపెల్లాని పెద్ద ఆపరేషన్ చేయకుండానే, ఒక చిన్న కాథెటర్ ద్వారా అమర్చవచ్చు. డాక్టర్లు సాధారణంగా దీన్ని భుజం దగ్గర ఉన్న ధమని (Axillary artery) లేదా ఇతర ప్రదేశాల నుంచి చొప్పిస్తారు. దీని అర్థం దీన్ని చిన్న కోతతోనే అమర్చవచ్చు. ఇంపెల్లా 5.5 లో స్మార్ట్ అసిస్ట్ టెక్నాలజీ ఉంది. ఇది పంపు పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి డాక్టర్లకు పనికొస్తుంది. దీనివల్ల రోగికి సరైన సహాయం అందుతుందో లేదో తెలుసుకుని, అవసరమైన మార్పులు వెంటనే చేయవచ్చు.
* గేమ్-ఛేంజర్
కత్రీనా చికిత్స పొందిన ఫిలడెల్ఫియాలోని చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ కట్సుహిడే మెడా (Dr. Katsuhide Maeda) ఇంపెల్లా గురించి మాట్లాడుతూ, ఇది ఒక “గేమ్-ఛేంజర్” అని అన్నారు. “దీన్ని ఛాతీ తెరవకుండానే అమర్చవచ్చు. ఇది నిజంగా అద్భుతం.” అని ఆయన ఆనందంగా చెప్పారు. ఈ పంపు వేలిముద్రంత చిన్నగా ఉంటుంది. కానీ ఇది చేసే మేలు మాత్రం చాలా గొప్పది. కత్రీనా లాంటి రోగులకు ఇది నిజంగా ఒక మిరాకిల్ కంటే తక్కువేమీ కాదని చెప్పుకోవచ్చు.
































