CCL 2025: కర్ణాటక బుల్డోజర్స్‌తో ఉత్కంఠ పోరు.. తెలుగు వారియర్స్ జట్టులో క్రికెట్ యోధులు వీరే!

సినీతారల క్రికెట్ లీగ్ ఛాంపియన్ క్రికెట్ లీగ్ 2025 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ టాప్ క్రికెట్ లీగ్ 11వ సీజన్‌ ఫిబ్రవరి 8వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభం కానున్నది.


అయితే ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దూకిన తెలుగు వారియర్స్ ఈ సీజన్‌లో టైటిల్ గెలుచుకోవడానికి ఉత్సాహంతో ఉరకలేస్తున్నది. అయితే తొలి మ్యాచులోనే టైటిల్ ఫేవరేట్‌గా నిలిచిన జట్టు కర్ణాటక బుల్డోజర్స్‌తో ఆమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

తెలుగు వారియర్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8వ తేదీన బెంగళూరులో కర్ణాటక బుల్డోజర్స్‌తో వార్‌కు సిద్దమైంది. ఈ జట్టుకు ఓనర్స్‌గా సచిన్ జోషి, విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి వ్యవహరిస్తున్నారు. ఈ జట్టుకు అఖిల్ అక్కినేని నాయకత్వం వహిస్తున్నారు. ఈసారి కప్ మాదేనని జట్టు విశ్వాసంతో కనిపిస్తున్నది.

తెలుగు వారియర్స్ జట్టు విషయానికి వస్తే.. సచిన్ జోషి, అశ్విన్ బాబు, తమన్ సాయిధరమ్ తేజ్, ఆదర్శ్, నందకిషోర్, నిఖిల్, రఘు, సామ్రాట్, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూం, హరీష్ జట్టులో ఉన్నారు. గతేడాది తమన్, అశ్విన్ బాబు చెలరేగి ఆడారు. ఈ సారి కూడా తమ ప్రతిభను చూపించేందుకు ఇతర జట్టు సభ్యులు ఉవ్విలూరుతున్నారు.

ఇక కర్ణాటక బుల్డోజర్స్ విషయానికి వస్తే.. ఈ జట్టుకు ఓనర్‌గా అశోక్ ఖేనీ వ్యవహరిస్తున్నారు. పటిష్టమైన జట్టుగా భావిస్తున్న టీమ్‌కు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కిచ్చా నాయకత్వం వహిస్తున్నారు. గతేడాది ఈ జట్టు రన్నరప్‌గా నిలువడం తెలిసిందే. ఈ సారి కూడా టైటిల్ గెలుచుకోవడానికి సిద్దంగా ఉన్నారు.

ఇక కర్ణాటక జట్టులో రాజీవ్ హెచ్, సుదీప్ కిచ్చా, సునీల్ రావు, జయరాం కార్తీక్, ప్రతాప్, ప్రసన్న, శివకుమార్, గణేష్, కృష్న, సౌరవ్ లోకేష్, చందన్, అర్జున్ యోగి, నిరూప్ భండారీ, నంద కిషోర్, సాగర్ గౌడ కీలక సభ్యులుగా ఉన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన పోటాపోటీగా జరిగే మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.