గాజు సీసాల వెనక ఉండే వస్తువులు వంగినట్టుగా, తలకిందులుగా కనిపించడం గమనించే ఉంటారు. అలా కనిపించడాన్ని ‘రిఫ్రాక్షన్’ అంటారు. కొంచెం క్రియేటివిటీని ఉపయోగించి ఆ వస్తువులను కెమెరాలతో బంధించడమే..
‘రిఫ్రాక్షన్ ఫొటోగ్రఫీ’. ఇందులో మన సబ్జెక్టు తిప్పినట్టు, పెద్దవిగా కనిపిస్తాయి. ఫొటోలను సరికొత్తగా చూపిస్తాయి. మరి.. రిఫ్రాక్షన్ ఫొటోగ్రఫీతో ఎలా మాయ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం నిత్యం ఉపయోగించే గాజు గ్లాసులు, అద్దాలు, ఐస్ క్యూబ్స్, నీటి బిందువులతో రిఫ్రాక్షన్ ఫొటోగ్రఫీని ట్రై చేయొచ్చు. ఇంకేమైనా అడ్వాన్స్‌డ్‌గా ప్రయత్నించాలని అనుకుంటే.. అక్రిలిక్ బాల్స్, ప్రిజమ్స్ వాడొచ్చు. ఇవి ఆన్‌లైన్ మార్కెట్‌లో ఈజీగానే దొరుకుతాయి.
ఎలా తీయాలి?
1. మొదటగా రిఫ్రాక్షన్ కోసం ఏదైనా ఒక వస్తువును ఎంచుకోండి. అవి ఐస్ క్యూబ్స్, నీటి బిందువులు, అద్దాలు, సీసాలు, లెన్స్ బాల్స్ లాంటివి ఏవైనా కావచ్చు.
2. ఇప్పుడొస్తున్న చాలా స్మార్ట్‌ఫోన్లు మాక్రో మోడ్‌ను కలిగి ఉంటున్నాయి. ఈ మాక్రో మోడ్.. మీ సబ్జెక్టుని డిటైల్డ్‌గా ఫొటో తీయటానికి వీలు కల్పిస్తుంది. మొదటగా మీ ఫోన్ కెమెరాలో మాక్రో మోడ్‌ని ఆక్టివేట్ చేయండి. తర్వాత మీ రిఫ్రాక్షన్ ఆబ్జెక్ట్ గుండా.. మీ సబ్జెక్ట్ (వ్యక్తి లేదా వస్తువు)ను కంపోజ్ చేసుకోండి. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో మాక్రో మోడ్ లేకపోయినా, మీ ఫొటోకి కావలసిన సపోర్ట్ ఇవ్వలేక పోయినా.. ఎక్స్‌టర్నల్ మాక్రో లెన్స్‌ని కూడా వాడొచ్చు. స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారవుతున్న మాక్రో లెన్స్‌లు.. ఆన్‌లైన్ మార్కెట్లలో దొరుకుతాయి.
3. మీ సబ్జెక్ట్‌ని ఏదైనా ఒక ఆసక్తికరమైన బ్యాక్‌గ్రౌండ్ (ఎత్తయిన భవనాలు/ సూర్యాస్తమయం/ రంగురంగుల వస్తువు) ముందు ఉంచండి. మీ రిఫ్రాక్షన్ సబ్జెక్ట్ నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న భవనాలు లేదా సూర్యాస్తమయాన్ని ఫొటో తీయండి. ఫొటోల్లో డిస్టోర్షన్ ఎఫెక్ట్ కనిపించేందుకు మీ కెమెరాను రిఫ్రాక్షన్ సబెక్టుకు దగ్గరగా ఉంచి ఫొటో తీయండి. మంచి ఎఫెక్ట్ కోసం వేరే వేరే యాంగిల్స్‌లో ట్రై చేయండి.
4. మీ రిఫ్రాక్షన్ ఆబ్జెక్ట్ మరింత షార్ప్‌గా రావడానికి ఎక్స్‌పోజర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడానికి వీలైతే పోర్ట్రెయిట్ మోడ్‌ను వాడండి. ఫ్రేమ్‌ని కరెక్ట్‌గా బ్యాలన్స్ చేయడానికి మీ ఫోన్ కెమెరాలోని గ్రిడ్ లైన్స్ వాడండి.
5. మీరు తీసిన ఫొటోలను Snapseed , Adobe Lightroom లాంటి యాప్స్‌తో పోస్ట్ ప్రాసెసింగ్ చేయండి. ఏవైనా కరెక్షన్లు ఉంటే చేసుకోండి. ఇంకా ఏమైనా ఆర్టిస్టిక్ ఫిల్టర్లు అప్లయి చేయడానికి VSCO లాంటి యాప్స్ వాడొచ్చు.
మరికొన్ని ఐడియాలు..
మనుషులు, పువ్వులు, నగరాల ల్యాండ్‌స్కేప్‌లను రిఫ్రాక్షన్ ఫొటోగ్రఫీలో చిత్రవిచిత్రంగా చూపించొచ్చు. తలకిందులుగా.. వంగినట్లు కనిపించేలా చేయొచ్చు. ఇందుకోసం కొన్ని ఐడియాలు..
లెన్స్‌బాల్ ల్యాండ్‌స్కేప్ : మీ సబ్జెక్ట్ (నగరం లేదా ప్రకృతి.. ఏదైనా) తలకిందులుగా కనిపించాలంటే.. దాని ముందు ఒక గాజు బంతిని పట్టుకోండి. ఆ గాజు బంతిలోంచి సబ్జెక్ట్‌పై ఫోకస్ చేసి.. ఫొటో తీయండి.
డ్రాప్లెట్ మ్యాజిక్ : ఒక గాజు ఫలకపై నీటిని స్ప్రే చేయండి. ఒక పువ్వును చేతిలో పట్టుకొని.. నీటి బిందువులో ఆ పువ్వు రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు ఆ నీటి బిందువుల్లోని పువ్వుల ప్రతిబింబాలను ఫొటో తీయండి.
ప్రిజం రిఫ్రాక్షన్ : కాంతిని సప్తవర్ణాల ఇంద్రధనుస్సుగా చూపించడానికి ‘ప్రిజం’ను ఉపయోగించండి.
ఫైనల్ టిప్స్..
మెరుగైన ఎఫెక్ట్స్ కోసం బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ఫుల్‌గా, ఆసక్తికరంగా ఉండేలా చూసుకోండి.
డార్క్ బ్యాక్‌గ్రౌండ్‌లో రిఫ్రాక్షన్ ఫొటోలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ప్రత్యేకమైన రిఫ్రాక్షన్స్ కోసం నూనె, సబ్బు బుడగలు వంటి విభిన్న ద్రవాలతో ప్రయోగాలు చేయండి.
చివరిగా.. ఓపికగా ప్రాక్టీస్ చేయండి. చిన్న సర్దుబాట్లు ఉంటే చూసుకోండి. అవే.. ఫొటోల్లో పెద్దపెద్ద మార్పులను తీసుకొస్తాయి. మీ ఇంటి బాల్కనీలో కూర్చునే అద్భుతమైన రిఫ్రాక్షన్ ఫొటోలను క్యాప్చర్ చేయండి.