సినీ, క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2025 (సీసీఎల్ 2025) ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 8న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై రైనోస్ – బెంగాల్ టైగర్స్ పోటీపడ్డాయి.
ఉత్కంఠగా సాగిన పోరులో బెంగాల్ టైగర్స్ విజయం సాధించి.. ఈ సీజన్‌లో తొలి గెలుపును సొంతం చేసుకుంది. ఆ వెంటనే తెలుగు వారియర్స్ – కర్ణాటక బుల్డోజర్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు హాజరై ఇరు జట్లకు విషెస్ తెలియజేశారు.
కర్ణాటక బుల్డోజర్స్ తొలి ఇన్నింగ్స్ :
తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు కృష్ణ – రాజీవ్‌లు కర్ణాటక ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా కృష్ణ అయితే ఫోర్లు , సిక్సర్లతో తెలుగు వారియర్స్‌పై విరుచుకుపడ్డాడు. ఇతగాడి దెబ్బకు బంతి మైదానంలో నలువైపులా పరుగులు పెట్టింది. కృష్ణ చివరి వరకు క్రీజులో నిలబడి 80 పరుగులతో నాటౌట్‌గా నిలవగా రాజీవ్ 1, కార్తీక్ 3, మంజునాథ్ 2, కరణ్ 11 పరుగులు చేశారు.
మరోవైపు తెలుగు వారియర్స్ ఎక్స్‌ట్రాల రూపంలోనే భారీగా పరుగులు సమర్పించుకోగా.. అఖిల్ ఫీల్డింగ్ మోహరింపు కూడా సరిగా లేదు. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను తెలుగు వారియర్స్ ఏమాత్రం నియంత్రించలేకపోయారు. మొత్తంగా కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 113 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. తెలుగు బౌలర్స్‌లో ఆది, ఖయ్యూంలు తలో వికెట్ పడగొట్టారు.
తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్ :
114 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన తెలుగు వారియర్స్‌కు ఓపెనర్లు అఖిల్, అశ్విన్ బాబులు మెరుపు ఓపెనింగ్ అందించారు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అఖిల్ విధ్వంసం సృష్టించాడు. అశ్విన్ ఔటైనా ఆదర్శ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు అఖిల్. హాఫ్ సెంచరీతో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు అఖిల్. మెరుపు ఫీల్డింగ్‌తో తెలుగు వారియర్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్ద కట్టడి చేసింది కర్ణాటక.
తెలుగు బ్యాట్స్‌మెన్‌లలో అఖిల్ 51, అశ్విన్ బాబు 12, ఆదర్శ్ 25, సాంబ 1, సామ్రాట్ 3, థమన్ 3, సచిన్ జోషి 1 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్స్‌లో మంజునాథ్, చందన్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో తెలుగు వారియర్స్‌పై కర్ణాటక 14 పరుగుల ఆధిక్యం సాధించింది.
కర్ణాటక బుల్డోజర్స్ సెకండ్ ఇన్నింగ్స్ :
రెండో ఇన్నింగ్స్‌లో కర్ణాటక బుల్డోజర్స్ దుమ్ముదులిపారు. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 14 పరుగులకు తోడు సెకండ్ ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి మొత్తంగా 137 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో తెలుగు వారియర్స్ గెలవాలంటే 138 పరుగులు చేయాల్సి ఉంది. చందన్ 12, మంజునాథ్ 12, సుదీప్ 14, కృష్ణ 16, రాజీవ్ 25, కరణ్ 34 పరుగులు చేశారు. తెలుగు బౌలర్స్‌లో సాంబ, అశ్విన్ బాబు, సామ్రాట్‌లు తలో వికెట్ పడగొట్టారు. కర్ణాటకను ఓ దశలో బిగించిన తెలుగు వారియర్స్.. తర్వాత పట్టు వదిలేయడంతో సుదీప్ సేన జూలు విదిల్చింది.
తెలుగు వారియర్స్ సెకండ్ ఇన్నింగ్స్ :
సీసీఎల్ 2025 సీజన్‌ను తెలుగు వారియర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో 46 పరుగుల తేడాతో అఖిల్ సేన ఓటమి పాలైంది. 138 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తెలుగు వారియర్స్‌కు థమన్, సామ్రాట్‌లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే వారిద్దరూ నిమిషాల వ్యవధిలో ఔట్ కావడం తర్వాత వచ్చినవారు పెద్దగా పోరాటం చేయకపోవడంతో మ్యాచ్ కర్ణాటక చేతిలోకి వెళ్లిపోయింది.
దీంతో తన రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది తెలుగు వారియర్స్. థమన్ 37, సామ్రాట్ 2, సచిన్ 2, అఖిల్ 9, అశ్విన్ బాబు 5, సాంబ 16, ఆదర్శ్ 1, రఘు 7, హరీష్ 5 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో గణేష్ 4, చందన్ 2, అనూప్ 2 వికెట్లు పడగొట్టారు.