Hair Fall: జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం ఏం చేయాలి?.

జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి?.. బట్టతల మొదలైతే మన ముందున్న పరిష్కార మార్గాలేంటి..?


తలపై పట్టుకుచ్చులాంటి జుట్టు ఇవాళ పలచబడిపోతోంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు కురుల కుదుళ్లను కదిలిస్తున్నాయి. పాతికేళ్ల వయస్సుకే మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతోంది. మూడు పదుల వయస్సు నిండకుండానే కొంత మందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. అసలు జుట్టు ఎందుకు రాలిపోతోంది..? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా..? జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి..? జీవనశైలి, అలవాట్లు, ఆహారం, సబ్బులు, షాంపూలు ఇత్యాది విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

బట్టతల మొదలైతే మన ముందున్న పరిష్కార మార్గాలేంటి.కెమికల్స్‌కి దూరంగా..
జుట్టు ఎదగడానికి అవసరమయ్యే పోషకాలను ఎప్పటికప్పుడు ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి. అలాగే జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి. అంటే దుమ్ము, ధూళి, చుండ్రు.. ఇలాంటివేవీ లేకుండా జాగ్రత్తపడాలి. తలస్నానం చేసేటప్పుడు కూడా ఎంతమేరకు షాంపూ అవసరమో అంతే వినియోగించాలి. వీటిలో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. అవసరానికి మించి షాంపూ ఉపయోగించినప్పుడు దాని ప్రభావం జుట్టు మీద తప్పకుండా కనిపిస్తుంది. అందుకే రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల్ని ఎంత తక్కువ వాడితే జుట్టుకి అంత శ్రేయస్కరం.

తొందరగా ఆరాలని..
ఆఫీసుకి టైం అవుతోందనో, కాలేజీ బస్సు మిస్సవుతుందనో జుట్టు త్వరత్వరగా ఆరిపోవాలని డ్రయర్లు వాడుతూ ఉంటాం. అయితే వీటివల్ల అప్పటికప్పుడు జుట్టు ఆరిపోయి సమస్య పరిష్కారం అయిపోయినా.. అవి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి ఉత్పత్తుల ద్వారా విడుదలయ్యే వేడి.. జుట్టుని మరింత బలహీనపరుస్తుంది. ఫలితంగా తల దువ్వేటప్పుడు వెంట్రుకలు సగంలో తెగిపోవడం లేదా మొత్తానికి వూడిపోవడం జరుగుతుంది. కాబట్టి డ్రయర్లు, కర్లర్స్, స్ట్రెయిటనర్స్.. మొదలైన ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు.

జుట్టుని బిగుతుగా కట్టద్దు..
కాలేజ్‌కు వెళ్లే అమ్మాయిలు లేదా ఆఫీసుకు వెళ్లే మహిళలు స్త్టెల్‌గా కనిపించడానికో లేక సమయాభావం వల్లనో ఎక్కువగా పోనీటెయిల్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ జుట్టంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ పెట్టడం వల్ల కుదుళ్లు బలహీనమవుతాయి. జుట్టుపై ఒత్తిడి పెరిగి తెగిపోతుంది. కాబట్టి జుట్టుని సాధ్యమైనంత వరకు వదులుగానే ఉంచాలి. అలా వదులుగా ఉండే హెయిర్‌స్త్టెల్స్ ప్రయత్నించడమే ఉత్తమం.

చివర్లు ట్రిమ్ చేయాలి..
జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు అవసరమయ్యే పోషణ సులభంగా అంది, ఎదుగుదల బాగుంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.