ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి అని బాలస్వామి అన్నారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య (Pranay Murder case)కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్‌కుమార్‌ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.


తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్‌ యంత్రాంగం.. విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది.

ప్రణయ్‌ హత్య కేసులో ఏ1 నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్‌కుమార్‌శర్మ, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్‌ రాకపోవడంతో జైలులోనే ఉండగా.. అస్గర్‌ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.

అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయి శ్రవణ్‌కుమార్‌ అన్నారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

ప్రణయ్‌-అమృత ప్రేమ వివాహంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు
2018 జనవరిలో ప్రణయ్‌, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చిచెప్పింది. 2018 సెప్టెంబర్‌ 14న అమృత వైద్యపరీక్షల కోసం భర్త ప్రణయ్‌, అత్త ప్రేమలతతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్‌ను దుండగుడు కత్తితో నరికి హత్యచేశాడు. ఘటనాస్థలంలోనే ప్రణయ్‌ చనిపోయాడు.

ఈ తీర్పుతో నేరస్థులకు కనువిప్పు కలగాలి: ప్రణయ్‌ తండ్రి
ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద ఆయన తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం బాలస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుతో నేరస్థులకు కనువిప్పు కలగాలన్నారు. ‘‘ప్రణయ్‌ హత్యతో మేం చాలా కోల్పోయాం. ఇలాంటి హత్యలు జరగడం విచారకరం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి’’ అని బాలస్వామి అన్నారు.