మధ్యప్రదేశ్ లో బయటపడ్డ ఘరానా మోసం- మోకాళ్ల నొప్పులు తగ్గిస్తామని విశ్రాంత ఉపాధ్యాయుడికి బురిడి
మోకాళ్ల నొప్పులను తగ్గిస్తానని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడిని బురిడి కొట్టించాడు ఓ మోసగాడు. విశ్రాంత ఉపాధ్యాయుడి చికిత్సకు రూ.6.5లక్షలు బిల్లు వేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగింది.
జబల్‌పుర్‌లోని శివ్ నగర్ చెందిన కేఎల్ సోనీ(78) విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 11న విజయనగర్‌లోని ఒక మెడికల్ స్టోర్ నుంచి మందులను కొనుగోలు చేసి వస్తున్నారు సోనీ. కాళ్ల నొప్పుల కారణంగా కాస్త కుంటుతూ నడుస్తున్నారు. అప్పుడు ఓ యువకుడు సోనీని పిలిచి ఎందుకు కుంటుతూ నడుస్తున్నారని అడిగాడు. తనకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయాని సోనీ చెప్పారు. తాను చాలా చోట్ల చికిత్స చేయించుకున్నానని, కానీ పూర్తిగా నయం కావడం లేదని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకున్న మోసగాడు వృద్ధుడిని మాయలోకి దింపాడు.
ఫేక్ డాక్టర్‌తో మోసం
తన తల్లికి కూడా మోకాళ్ల సమస్యే ఉండేదని సోనీకి మోసగాడు చెప్పాడు. ఆమె నాగ్‌పుర్ నుంచి వచ్చిన ఆర్కే పటేల్ అనే వైద్యుడి వద్ద చికిత్స తీసుకుందని నమ్మబలికాడు. ఇప్పుడు తన తల్లి పూర్తి ఆరోగ్యంతో ఉందని తెలిపాడు. దీంతో మాయగాడి వలలో రిటైర్డ్ టీచర్ పడిపోయారు. ఈ క్రమంలో ఓ రోజు వృద్ధుడికి ఓ మహిళ ఫోన్ చేసింది. డాక్టర్ ఆర్కే పటేల్ నాగ్‌పుర్ నుంచి తమ దగ్గరకు వచ్చారని పేర్కొంది. మోకాలికి చికిత్స చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందని చెప్పింది. ఆ చికిత్సతోనే తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపింది.
రక్తపు బొట్టుకు రూ.3 వేలు ఛార్జ్
మరుసటి రోజు డాక్టర్ ఆర్కే పటేల్ సోనీ ఇంటికి వచ్చాడు. కాళ్లకు వైద్య పరీక్షలు చేశాడు. సోనీకి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని భయాందోళనకు గురిచేశాడు. వెంటనే చికిత్స చేసుకోవాలని, లేదంటే ప్రమాదమని హెచ్చరించాడు. కొన్ని పరిస్థితుల్లో కాళ్లు కూడా తీసేయాల్సి రావొచ్చని అన్నాడు. సోనీ వైద్యుడి మాటలను నమ్మి చికిత్సకు అంగీకరించారు. ఓ ఇత్తడి పైపుతో సోనీ మోకాళ్ల నుంచి రక్తాన్ని బయటకు తీశాడు ఆ వైద్యుడు. చికిత్స కోసం ప్రతి రక్తపు చుక్కకు రూ.3,000 వసూలు చేస్తానని చెప్పాడు. కొంత సమయం తర్వాత రూ.6.5లక్షలు బిల్లు అయ్యిందని చెప్పేసరికి సోనీ షాకయ్యారు. అప్పుడు తన దగ్గర ఉన్న దాదాపు రూ.లక్ష ఇచ్చారు. బిల్లు అందుకున్న తర్వాత నకిలీ వైద్యుడు ఈ చికిత్స గురించి ఎవరికీ చెప్పొద్దని సోనీని కోరాడు. అనంతరం కొన్ని మందులను రాసి అక్కడి నుంచి పరారయ్యాడు.
మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు
నకిలీ వైద్యుడు ఇచ్చిన మందులను చీటీని పట్టుకుని మెడికల్ షాపునకు వెళ్లగా వాటి ధర రూ.75 వేలని వృద్ధుడికి తెలిసింది. దీంతో అతడు మందులను కొనుగోలు చేయలేదు. అయినప్పటికీ తాను మోసపోయానని గ్రహించలేదు. ఒకరోజు మార్కెట్ నుంచి సోనీ కాస్త కుంటుతూ నడుచుకుని వస్తుండగా ఓ వ్యక్తి పాత తరహా ప్రశ్నే వేశాడు. మీ కాళ్లలో ఏమైనా నొప్పిగా ఉందా? అని అడిగాడు. తన తండ్రి కాలు నొప్పిని ఆర్కే పటేల్ అనే వైద్యుడు నయం చేశాడని అనడం వల్ల సోనీకి తాను మోసపోయానని అర్థమైంది. జరిగిన విషయాన్నంతా సోనీ తన కుమారుడికి చెప్పాడు. అప్పుడు జబల్‌పుర్‌లోని విజయనగర్ పోలీస్ స్టేషన్ లో మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడు కేఎల్ సోనీ.
“ఈ సంఘటనకు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నాం. రిటైర్డ్ టీచర్ అందించిన ఫోన్ నంబర్లు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అయినప్పటికీ మొబైల్ నంబర్ల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నకిలీ వైద్యుడి పేరు ఆర్కే పటేల్. వృద్ధుడితో మాట్లాడిన మోసగాడి పేరు అరుణ్. ” అని విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ వీరేంద్ర పవార్ తెలిపారు.