తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలతోపాటు వేతనాల పెరుగుదల, పీఆర్సీ, డియర్నెస్ అలవెన్స్ వంటివి ఇవ్వాల్సి ఉంది.
వీటిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యంగా జీతాలు ఇస్తున్నామని.. అయితే వాటికి వీటికి సర్దుబాటు చేస్తూ జీతాలు చెల్లిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రొటేషన్ పద్ధతిలో కేటాయింపులు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మీ సహకారం అవసరం. కొన్నిసార్లు వెనుకా ముందు ఆలస్యమైనా ఇది మన కుటుంబం. మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు ఎలా అయితే సమన్వయం చేసుకుని ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటామో అదే మాదిరి ప్రభుత్వం కూడా అలాగే’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘అణా పైసా సహా అన్ని లెక్కలు మీకు అందిస్తా. మీరు ఓ కమిటీ ఏర్పాటుచేసుకుని ఏది పంచుతారో మీరు చెప్పినట్టు చేస్తా’ అని ఉద్యోగులకు చెప్పారు.
‘అవును.. జీతాలు బిల్లులు పెండింగ్ పెడుతున్నాం. ఆశ వర్కర్ల జీతాలు, అంగన్వాడీ వర్కర్ల జీతాలు ఆపుతున్నాం. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పెండింగ్ పెట్టి రొటేషన్ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం’ అని రేవంత్ రెడ్డి వివరించారు. ‘కష్టమైనా.. నష్టమైనా మీకు చెప్పి.. మీకు వివరించి.. మీ అనుమతి తీసుకుని.. ఏం చేయమంటే అది చేస్తా’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘రిజర్వ్ బ్యాంక్ వద్ద తల తాకట్టు పెట్టి అప్పులు తీసుకుని జీతాలు చెల్లించా’ అని రేవంత్ రెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. ప్రతి నెల రూ.6,500 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామని చెప్పారు.
కొలువుల జాతర సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఐదు డియర్నెస్ అలవెన్స్లు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో మరో డీఏ రానుంది. ఇప్పటికే పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా అది కూడా తాత్సారమవుతోంది. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు దక్కాల్సి ఉంది. వీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే ‘సర్దుకోవాలి’ అని చెప్పినట్టు అర్థమవుతోంది. ఇంకొన్నాళ్లు సమయం పడుతుందని పరోక్షంగా చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.
































