నెల చివరిలో ఉద్యోగుల బకాయిల చెల్లింపు

ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జగన్‌ దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు రూ.25 వేల కోట్లు ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంత చెల్లించింది. ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్‌, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల రూపంలో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఉపయోగించనున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.