హ్యాపీ హోలీ అంటూ యాసిడ్‌తో దాడి..

హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయం అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోపలికి వచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ అకౌంటెంట్‌ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నర్సింగరావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


సాయంత్రం సమయంలో ఆలయం లోపలికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ పోశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.. తీవ్ర గాయాలతో అకౌంటెంట్ విలవిలాడిపోయారు..

కాగా.. సైదాబాద్‌ ఆలయంలో యాసిడ్‌ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.

నిందితుడు క్యాప్, మాస్క్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే.. ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడిగా అనిపిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇక.. యాసిడ్‌ ఘటనను ఆలయ ఛైర్మన్‌ శ్రీధర్‌ ఖండించారు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడుగుతూ అకౌంటెంట్‌ నర్సింగ్‌రావుపై సడెన్‌గా దాడి చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.