భారతదేశంలో పాలన రాజ్యాంగం అనుసరించి జరుగుతుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ లేదు. జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి రావడంతో 1950 నుంచి భారత్ సర్వసత్తాక, గణతంత్ర రాజ్యంగా మారింది.
ఇందులో పౌరుల హక్కులు, విధులు లాంటి పలు అంశాలున్నాయి.
సువిశాల భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నా అందరికీ సమానత్వం, హక్కుల కోసం రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ పౌరులకు దోహదం చేస్తున్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి భారత సుప్రీంకోర్టు తీరును విమర్శించారు, ఆర్టికల్ 142 ను క్షిపణి అని అన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు హక్కులు కల్పిస్తూ, వారి విధులను సైతం వివరిస్తుంది. అలాంటి ఆర్టికల్స్ ను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తెలిస్తే కేవలం మనకు మాత్రమే కాదు సమాజానికి శ్రేయస్కరం. అవి మనకు సాధికారత కల్పిస్తాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే వ్యత్యాసం లేకుండా అందరి హక్కులను రాజ్యాంగం కాపాడుతోంది. అయితే అందులోని కొన్ని ఆర్టికల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. కనీసం వాటి గురించి ప్రాథమిక అవగాహనా అయినా కలిగి ఉంటే మేలు.
1. ఆర్టికల్ 14 – చట్టం ముందు అందరూ సమానమే
భారతదేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారు. ప్రతి ఒక్కరికీ చట్టాలు ఒకే విధంగా వర్తిస్తాయి. పేద, ధనిక అనే వ్యత్యాసం ఉండదని ఈ ఆర్టికల్ తెలుపుతుంది.
2. ఆర్టికల్ 15 – ఏ వివక్ష లేదు
మీ కులం, లింగం, జన్మస్థలం, మత విశ్వాసాల ఆధారంగా వివక్షకు గురిచేయకూడదు. ఈ అధికరణ భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని కాపాడుతుంది.
3. ఆర్టికల్ 16 – ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు
ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించాలి. మెరిట్, అర్హతల ఆధారంగా అవకాశం కల్పించాలని ఈ ఆర్టికల్ చెబుతోంది.
4. ఆర్టికల్ 17 – అంటరానితనం నేరం
అస్పృశ్యత, అంటరానితనాన్ని చట్టవిరుద్ధం చేశారు. ఎవరినైనా అంటరాని వారిగా చూస్తుంటే ఈ ఆర్టికల్ ద్వారా న్యాయం పొందవచ్చు. కలం ద్వారా జరిగే సామాజిక అన్యాయాన్ని ఇది కొట్టివేసింది.
5. ఆర్టికల్ 19 – వాక్ స్వాతంత్య్యం
మీకు నచ్చిన చోట పరిమితులకు లోబడి సమావేశం కావొచ్చు. ఎవరైనా కలవవచ్చు, మాట్లాడవచ్చు. మీ వ్యక్తిగత విషయాల్లో వేరే వారి జోక్యం చేసుకోకూడదు.
6. ఆర్టికల్ 21 – జీవించే హక్కు, స్వేచ్ఛ
ఈ ఆర్టికల్ అందరికీ జీవించే హక్కు కల్పిస్తుంది. దీని ద్వారా ఒకరి వ్యక్తిగత విషయాలకు గోప్యత కల్పిస్తుంది. ఇతరులు ఎవరిపైనా నిఘా పెట్టకుండా ఇది అడ్డుకుంటుంది.
7. ఆర్టికల్ 21A – విద్యా హక్కు
6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు చదువు తప్పనిసరి చేసిన ఆర్టికల్ ఇది. వారిని ఏ సాకులు లేకుండా చదువుకునేందుకు అవకాశం కల్పించాలని చెబుతుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు.
8. ఆర్టికల్ 25 – మత స్వేచ్ఛ
మీరు ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు. హిందు దేవుళ్లు, లేక యేసును, అల్లాను లేదా ఎవరినైనా మీరు ఆరాధించేందుకు అవకాశం కల్పిస్తుంది. మీ ఆధ్యాత్మికతను ఇది కాపాడుతుంది.
9. ఆర్టికల్ 32 – రాజ్యాంగ పరిష్కార హక్కు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనిని రాజ్యాంగానికి హృదయం, ఆత్మ అని పేర్కొన్నారు. మీ హక్కులు ఉల్లంఘనకు గురైతే ఈ ఆర్టికల్ మిమ్మల్ని నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పిస్తుంది.
10. ఆర్టికల్ 44 – యూనిఫామ్ సివిల్ కోడ్
ఉమ్మడి పౌర స్మృతి ఇది ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న ఆలోచన. మతంతో సంబంధం లేకుండా అన్ని చట్టాలను ఏకీకృతం చేయడం. దేశంలో దీనిపై ఇంకా చర్చ సాగుతోంది. కొన్ని రాష్ట్రాలు దీన్ని ఆమోదించి అమలు చేస్తున్నాయి. .
11. ఆర్టికల్ 51ఎ – ప్రాథమిక విధులు
దేశం మన కోసం ఏం చేసిందని తరచుగా కొందరు అడుగుతుంటారు. అయితే నువ్వు దేశం కోసం ఏం చేయాలి, ఎలా మెలగాలో ఈ అధికరణ వివరిస్తుంది.
12. ఆర్టికల్ 243 – పంచాయతీ రాజ్ సాధికారత
భారత్ లో పరిపాలన గ్రామస్థాయిలో పంచాయతీ రాజ్ తరహాలో కనిపిస్తుంది. కింది స్థాయిలో ఇక్కడి నుంచే పాలన ప్రారంభమవుతుంది. గ్రామస్తులతో కలిసి సర్పంచ్ నిర్ణయాలు తీసుకునే అధికారం ఇస్తుంది. గ్రామీణ భారతదేశంలో దీన్ని నిశ్శబ్ద విప్లవం అంటారు.
13. ఆర్టికల్ 280 – ఆర్థిక సంఘం
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీని ఇది సజావుగా సాగేలా చేస్తుంది. ఈ అధికరణ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగేలా కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తుంది.
14. ఆర్టికల్ 324 – ఎన్నికల కమిషన్ సూపర్ పవర్
దేశంలో ఎన్నికలను ఎన్నికల కమిషన్ ఏ పరిమితి లేకుండా నిర్వహిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ నుంచి నోటిఫికేషన్, పోలింగ్ బ్యాలెట్ లెక్కింపు వరకు ఎన్నికల కమిషన్ సూపర్ పవర్ గా వ్యవహరిస్తుంది.
15. ఆర్టికల్ 368 – రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తారు
ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్నా కొన్నిసార్లు నియమాలు మార్చాల్సి వస్తుంది. రాజ్యాంగ నియమాలను జాగ్రత్తగా, రాజ్యాంగబద్ధంగా సమిష్టిగా ఎలా మార్చవచ్చో ఈ అధికరణ తెలుపుతుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే లోక్సభ, రాజ్యసభలో వాటికి ఆమోదం లభిస్తే కొన్ని నియమాలలో మార్పులు, చేర్పులు చేయవచ్చు.
ఆర్టికల్ 142, సుప్రీంకోర్టుకు స్పెషల్ పవర్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు పెండింగ్లో ఉన్న ఏదైనా కేసు లేదా విషయంలో పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన ఏదైనా ఆర్డర్ జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ముందు ఉన్న ఒక సాధనం ఆర్టికల్ 142. న్యాయం కేవలం కాగితంపై మాత్రమే కాదని, చట్టాలు లేదా నిబంధనలు సరిపోలని సందర్భాలలో ఇది దోహదం చేస్తుంది.
సుప్రీంకోర్టుకు చట్టం ద్వారా నేరుగా పరిష్కరించలేని కేసులలో న్యాయం చేయడానికి ఆర్టికల్ 142 విచక్షణాధికారిన్ని అందిస్తుంది, అవసరమైనప్పుడు న్యాయం కోసం దీనిని వినియోగించవచ్చు. న్యాయం కోసం సర్వోన్నత న్యాయస్థానం దీని ద్వారా ఆర్డర్ పాస్ చేస్తుంది.
































