ఏపీలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ (Aarogyasree) సేవలను నేటి నుంచి నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. ఆసుపత్రుల యాజమాన్యాల సేవలు నిలిపివేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి ఆస్పత్రి యాజమాన్యాన్ని చర్చలకు పిలిచిన ప్రభుత్వం..
బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో డిసెంబర్ 25న ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా ఈరోజు నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అసలేం జరిగిందంటే..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులకు సంబంధించి రూ.1200 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది కాకుండా, పదేళ్ల క్రితం నిర్ణయించిన ప్యాకేజీలతోనే చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్సల ధరలను పెంచాలని ఆసుపత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.
ఆసుపత్రుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు లేఖ రాశారు. గత నెలలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీలపై చార్జీలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
నెలలు గడుస్తున్నా ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల హామీ లభించలేదు. దీంతో నెట్‌వర్క్‌లోని ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులకు సేవలు కొనసాగుతుండగా, నేటి నుంచి కొత్త రోగులను చేర్చుకోకూడదని నిర్ణయించారు.
గత మూడు నెలల్లో రెండుసార్లు ప్రభుత్వానికి ఆస్పత్రి యాజమాన్యం డెడ్ లైన్ ఇచ్చినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. జనవరి 25 నుంచి సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఈహెచ్‌ఎస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రులకు ఫీజుల చెల్లింపులో జాప్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు చెల్లించకుండా రోగులకు వైద్యసేవలు అందించలేమని ఆసుపత్రులు చెబుతున్నాయి.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. డిసెంబరు 25 నుంచి సేవలను నిలిపివేస్తామని వారు ప్రకటించారు, కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ముందస్తు నోటీసు లేకుండా సేవలను నిలిపివేయాలని తాజాగా నిర్ణయించారు.