ఊరమిరపకాయలనగానే ఎవ్వరికైనా నోరూరుతుంది. వేసవిలో ఊరగాయలతో పాటు తాజా ఊరమిరపకాయలూ డబ్బాల్లో చేరిపోతాయి. ఊరమిరపకాయలేని పులుసుకూర, సాంబారు, పప్పుకూర, రసంతో అన్నం తినడమంటే కాస్త నీరసమనే చెప్పాలి.
మరి వీటిని మజ్జిగలో నానబెట్టి నాలుగు రోజుల పాటు చేసే తతంగమంతా చేయాలంటే అందరికీ కుదిరేపని కాదు. అందుకే మజ్జిగతో పనిలేకుండా ఒక్క రోజులోనే ఊరమిరపకాయల్ని పెట్టుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
సూచనలు..
ఊరమిరప కాయలకు ప్రత్యేకమైన పచ్చిమిరపకాయలు ఉంటాయి. లావుగా, మంట తక్కువగా ఉండే ఈ మిరపకాయలు తాజాగా ఉండాలి. పచ్చిమిర్చిని నీళ్ళలో ఉప్పువేసి అరగంట ఉంచి తర్వాత శుభ్రంగా కడగాలి. ఒక పలుచని వస్త్రం పరిచి దానిపై తడి పోయేంత వరకూ ఆరబెట్టాలి. ఆ తర్వాత మిరపకాయ తొడిమ భాగం నుంచి కొసవరకు చివర్లు తెగకుండా చీల్చాలి.
పెరుగుతో..
కావలసినవి : పచ్చిమిర్చి- కేజీ, ధనియాలు- 6 స్పూన్లు, మెంతులు- 2 స్పూన్లు, జీలకర్ర-6 స్పూన్లు, మరమరాలు- పెద్ద గ్లాసు, ఉప్పు- తగినంత, ఇంగువ- 1/2స్పూను, పసుపు- 1/2 స్పూను, నిమ్మకాయలు- 2, పెరుగు- తగినంత
తయారీ : పచ్చిమిర్చిని చివరలు తెగకుండా నిలువుగా చీల్చుకుని అరగంట నీళ్ళలో వేయాలి. తర్వాత నీళ్ళు వంచేసి పలుచని వస్త్రంపై పరిచినట్లు ఆరబెట్టాలి. మెంతులు, ధనియాలు, జీలకర్ర లైట్‌గా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటితో మరమరాలు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుని, దానిలో ఉప్పు, ఇంగువ, పసుపు వేసి ఒక తిప్పుతిప్పి వెడల్పు గిన్నెలో తీసుకోవాలి. దీనిలో నిమ్మరసం, పెరుగు వేసి కలుపుతూ ముద్దగా చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయలో నిండుగా ఈ ముద్దను కూర్చాలి. వీటిని దాదాపు వారం ఎండబెట్టాలి. అంతే మజ్జిగలో వేయని చల్ల మిరపకాయలు రెడీ. గాలి తగలని సీసాలో పెట్టుకుంటే సంవత్సరమంతా కరకరలాడుతూనే ఉంటాయి.
మామిడికాయతో..
కావలసినవి : మిరపకాయలు- కిలో, మామిడికాయ ముక్కలు- 4 కప్పులు, కళ్ళుప్పు- కప్పు, జీలకర్ర- 2 స్పూన్లు, పసుపు- స్పూను, మెంతి, ఆవపిండి- 2 స్పూన్లు
తయారీ : మిరపకాయల్ని శుభ్రంగా కడిగి పలుచటి వస్త్రంపై తడి పోయేంతవరకూ ఫాన్ గాలికి ఆరబెట్టాలి. మామిడికాయ ముక్కలు, కళ్ళుప్పు, జీలకర్ర, పసుపు, మెంతి, ఆవపిండి అన్నీ జార్‌లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆరిన మిరపకాయల్ని చివర్లు తెగకుండా నిలువుగా చీల్చుకోవాలి. ఇప్పుడు మిరపకాయ లోపల ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. గిన్నెపై మూతపెట్టి ఆరుగంటలపాటు ఊరనివ్వాలి. ఆ తర్వాత రెండుమూడురోజులు ఎండలో పెట్టాలి. అంతే వెరైటీ మామిడి ఊర మిరపకాయలు రెడీ. పూర్తిగా ఎండిన తర్వాత గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవాలి. ఇవి సంవత్సరమంతా నిల్వ ఉంటాయి.
వాముతో..
కావలసినవి : పచ్చిమిర్చి- 500 గ్రా, వాము- 30గ్రా, ఉప్పు- 50గ్రా, నిమ్మరసం- 4 స్పూన్లు
తయారీ : ఊరమిరపకాయలకు వాడే ముదిరిన, లావుగా ఉన్న పచ్చిమిర్చిని శుభ్రం చేసుకుని ఆరబెట్టాలి. తర్వాత తొడిమలు తీసి రెండు నిలువు చీలికలుగా కట్‌చేసుకుని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. వాటిలో మెత్తగా మిక్సీ పట్టిన వాము, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి గంటసేపు పక్కనుంచాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి గిన్నెలో అదిమి మూతపెట్టి ఒకరోజంతా అలాగే ఉంచాలి. రెండోరోజు పలుచగా ఎండలో ఎండబెట్టాలి. చెమ్మలేకుండా బాగా ఎండిపోయేంత వరకు ఎండబెట్టి గాలి చొరని సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ వాము ఊరమిరపకాయలు రెడీ. ఇవి సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి.
































