You know those round lids on the train? రైలుపై ఆ గుండ్రని మూతలేంటో మీకు తెలుసా ?

www.mannamweb.com


ట్రైన్ జర్నీ చేయనివారు మనలో ఎవరూ వుండరనే చెప్పొచ్చు. అయితే, ట్రైన్ కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాల్ని మనం పెద్దగా గమనించం, ఒకవేళ గమనించినా వాటికి సంబంధించిన వివరాలేంటో మనకు తెలిసి వుండకపోవచ్చు. అలాంటి ఒక ఆసక్తికరమైన విశేషాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం.

రైళ్లలో ముద్రించిన వివిధ సంకేతాలు, సంఖ్యలు, అక్షరాల గురించి మనలో చాలామందికి తెలియదు. రైలు పైకప్పుపై గుండ్రని ఆకారపు మూతలు వుండడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అవి దేనికో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గుండ్రని ఆకారపు మూతలు కోచ్‌ల లోపల నుంచి కనిపించవు. బ్రిడ్జిల నుంచి లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నుంచి రైలు పైకప్పులను గమనిస్తే అవి కనిపిస్తాయి.
వాటిని అమర్చడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది.

ఈ మూతలు కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు. రైలులో ఉన్న ప్రయాణీకులు సౌకర్యంగా ఉండేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. వీటిని రూఫ్ వెంటిలేటర్లు అంటారు. ఇవి కోచ్ లోపల ఉన్న ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. కోచ్‌లలో ప్రయాణికుల సంఖ్య పెరిగినపుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు లోపల కూర్చోవడం కష్టమవుతుంది. ప్రయాణికులకు అలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు.

వేడి గాలి ఎప్పుడూ పైకి ప్రయాణిస్తుంది. అలా పైకి ప్రయాణించిన గాలి ఈ రూఫ్ వెంటిలేటర్ల గుండా బయటకు వెళ్లిపోతుంది. అందుకే కిటికీలు ఉన్నప్పటికీ వేడి గాలిని బయటకు పంపడంలో రూఫ్ వెంటిలేటర్లది కీలక పాత్ర. ఒకవేళ వర్షం పడినా నీరు లోపలికి వెళ్లకుండా ఉండేలా వీటిని రూపొందించారు. చూశారా, ఇలాంటివాటిని ఎప్పుడూ చూస్తూంటాం గానీ, పెద్దగా పట్టించుకోం.