తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర దాడి కుట్రను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) దేశంలోకి వలసలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో కేబినెట్ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ (West Bengal) నుంచి కొందరు వలస వచ్చారని కామెంట్ చేశారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ మీదుగా వెస్ట్ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి స్థానికుల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సైతం కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు మయన్మార్ మీదుగా దేశంలోకి చొరబడి రాష్ట్రంలోకి వస్తున్నట్లుగా తెలిసిందని పేర్కొన్నారు.
రోహింగ్యాల వలసలు భద్రతాపరమైన అంశమని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఒక సున్నితమైన ప్రాంతమని తెలిపారు. గతంలో కోయంబత్తూరు, హైదరాబాద్ బాంబు పేలుళ్ల వంటి సంఘటనలను మనం ఇప్పటికే చూశామని అన్నారు. ఇటీవలే కాకినాడ పోర్ట్కు ముప్పు ఉందనే విషయం తన దృష్టి వచ్చిందని.. అదే విషయాన్ని తాను డీజీపీకి కూడా తెలిపానని పేర్కొన్నారు. తాజాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఉగ్రవాదులను అపులోకి తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర భద్రత, శాంతిభద్రతల విషయంలో పోలీసులు ఎల్లప్పుడు అప్రమత్తంగా పవన్ కళ్యాణ్ అన్నారు.
































