నాలుగేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన చోటుచేసుకోగా..
అందుకు సంబంధించిన ఆడియో ఇటీవల వైరల్‌గా మారింది. ఆసుపత్రిలో సరిపడా పడకలు లేకపోవడంతో కొవిడ్ చికిత్స తీసుకుంటున్న ఓ మహిళా రోగిని చంపేయాలని ఓ వైద్యుడు సహచర వైద్యుడికి సూచించినట్లు తెలిసింది. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సదరు వైద్యుడిపై కేసు నమోదైంది.
2021లో కరోనా (Covid 19) మహమ్మారి తీవ్రంగా ప్రబలిన సమయంలో రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. బాధితులకు పడకలు, ఆక్సిజన్ దొరకడమే కష్టంగా మారింది. అదే సమయంలో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జిల్లా అదనపు సర్జన్‌గా ఉన్న డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే, మరో వైద్యుడు శశికాంత్ డాంగేల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. పదిరోజులుగా చికిత్స పొందుతున్న ఓ మహిళను చంపేయాలని శశికాంత్ డాంగేకు దేశ్‌పాండే ఫోన్‌లో సూచించాడు. దీనికి డాంగే స్పందిస్తూ.. ఆక్సిజన్‌ను సరఫరాను ఇప్పటికే తగ్గించినట్లు చెప్పడం గమనార్హం. ఆసుపత్రిలో అవసరం మేరకు పడకలు లేకపోవడంతో అలా చెప్పినట్లు వారి సంభాషణను బట్టి తెలిసింది.
అసలేం జరిగిందంటే..
ఉద్గిర్ ఆసుపత్రిలో బాధిత మహిళ పది రోజులపాటు చికిత్స తీసుకుంది. ఏడవ రోజు.. మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త పక్కనే డాక్టర్ డాంగే కూర్చొని భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో అతడికి డాక్టర్ దేశ్‌పాండే నుంచి ఫోన్ వచ్చింది. లౌడ్ స్పీకర్ ఆన్ చేసిన డాంగే.. ఆసుపత్రిలో అప్పటి పరిస్థితులను వివరిస్తున్నాడు. ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని దేశ్‌పాండే అడగ్గా.. ప్రస్తుతం ఖాళీ లేవని డాంగే చెప్పాడు. దీంతో ఓ మహిళా రోగి పేరు చెప్పిన దేశ్‌పాండే.. ‘ఆమెను చంపేయ్.. నీకు అలవాటే కదా’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇదంతా పక్కనే ఉన్న బాధిత రోగి భర్త విని షాక్‌కు గురయ్యాడు. చికిత్స అందుతున్నందున మౌనంగా ఉండిపోవాలని నిశ్చయించుకున్న అతడు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆమె కోలుకోవడంతో డిశ్చార్జి చేయించి తీసుకువెళ్లాడు. అనంతరం రోగి భర్త ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
- ఏప్రిల్ 2021లో చోటుచేసుకున్న ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇటీవల వైరల్‌గా మారింది. ఇది బాధిత మహిళ కుటుంబం చెవిన పడింది. దీంతో ఆ దంపతుల ఫిర్యాదు మేరకు వైద్యుడు దేశ్‌పాండేపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. మరో వైద్యుడికి కూడా నోటీసులు జారీ చేశామని, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
































