‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ మిస్సింగ్.. దాన్ని ఎవరు తీసుకెళ్లారో క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

 ‘కన్నప్ప’ (Kannappa) చిత్ర హార్డ్‌ డిస్క్‌ మాయంపై కథానాయకుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. చెన్నై వేదికగా జరిగిన చిత్ర ప్రచార కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.


మనోజ్‌ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పనిచేశారని ఆరోపించారు. వాళ్లుగా తీసుకున్నారా? లేక ఎవరైనా చెబితే చేశారా?అన్నది మాత్రం తెలియదని అన్నారు.

రాముడికే తప్పలేదు నేనెంత..

”ఇక్కడ కేవలం ‘కన్నప్ప’ మూవీ గురించే మాట్లాడుకుందాం. ఫ్యామిలీ విషయాలపై దయచేసి ఎవరూ ప్రశ్నలు అడగవద్దు. అందరి ఇళ్లలోనూ ఉండే సమస్యలే. శ్రీరామచంద్రుడి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి. ఇక నేనెంత?. ‘కన్నప్ప’లోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్‌ పూర్తి చేసిన డేటా ఆ మిస్సయిన హార్డ్‌డిస్క్‌లో ఉంది. సినిమా డిజిటల్‌ వెర్షన్‌కు సంబంధించి హాలీవుడ్‌లో మూడు కాపీలు, హైదరాబాద్‌లో రెండు కాపీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కాపీలు వేర్వేరు కార్లలో ఒకటి డీఐటీ టెక్నీషియన్‌ దగ్గరకు, మరొకటి ఆఫీస్‌కు వెళ్తుంది. ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి ఒక్కరూ సేఫ్టీ డ్రైవ్‌ను పెట్టుకుంటారు. ఇది సాధారణంగా జరిగేదే. ‘కన్నప్ప’ సీజీ పనులు భారత్‌లో మొత్తం ఎనిమిది కంపెనీలు చేస్తున్నాయి. విదేశాల్లో రెండు కంపెనీలు ఆ పనిలో ఉన్నాయి. చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ ఇలా వేర్వేరు చోట్ల ఆ పనులు జరుగుతున్నాయి”

అందుకే హార్డ్‌డ్రైవ్‌ కొరియర్‌ చేశారు..

”హార్డ్‌ డిస్క్‌ బయటకు వెళ్లిన విషయమై పోలీసుల ద్వారా రిపోర్టర్‌కు తెలిసి వార్తల్లో వచ్చింది. అంతేకానీ, నేను ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అది నాకు ఇష్టం లేదు. కలర్‌ గ్రేడింగ్‌కు సంబంధించి ముంబయిలో వర్క్‌ జరిగితే, హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొదటిసారి పంపినప్పుడు ఇబ్బంది ఎదురైంది. సరిగా రాలేదు. దీంతో ఆ కంపెనీ హార్డ్‌ డ్రైవ్‌లో ఆ సీన్స్‌ను పెట్టి కొరియర్‌ చేసింది. డీఐ పనులు చేస్తున్న కంపెనీ ఎంతో మంచి సంస్థ. చాలా కష్టపడి పనిచేస్తారు. ఆ హార్డ్‌డ్రైవ్‌ ఇటు ప్రొడక్షన్‌ హౌస్‌కు గానీ, ఇక్కడ కలర్‌ గ్రేడింగ్‌ చేసే కంపెనీకి గానీ రాలేదు”

వాళ్లు మనోజ్‌ ఇంట్లో పనిచేసే వాళ్లని అనుమానం

”సాధారణంగా మేం రెండు అడ్రస్‌లు మెయింటెయిన్‌ చేస్తాం. ఒకటి ఆఫీస్‌ అడ్రస్‌ కాగా, ఇంకొకటి జీఎస్టీ రిజిస్ట్రార్‌ అడ్రస్‌ ఉంది. ఇది ఫిల్మ్‌ నగర్‌లోని నాన్నగారి ఇంటి అడ్రస్‌. నాన్నగారి ముగ్గురి పిల్లలకు సంబంధించి ఏది వచ్చినా అక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి, ఎవరిది వాళ్లకు అందజేస్తారు. 15ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. ఇటీవల ఇంట్లో పరిస్థితులు సరిగా లేవన్న విషయం మీకు తెలిసిందే. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీకి కొరియర్‌ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చాడు. ఆ ప్యాకెట్‌ తీసుకుని, చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి నాలుగు వారాలు అయింది. నేను ఈ విషయమై ఫిర్యాదు చేయాలనుకోలేదు. వాళ్లిద్దరూ మా సోదరుడు మనోజ్‌ ఇంట్లో పనిచేస్తున్నారా? లేదో తెలియదు. అక్కడే ఉంటారని అనుకుంటున్నా. అతను చెబితే వచ్చి వీళ్లు తీసుకున్నారా? లేక వాళ్లకు వాళ్లే స్వయంగా తీసుకున్నారో కూడా తెలియదు”

అలా లీకైన విషయం బయటకు వచ్చింది

”ఈ విషయమై మొదటి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకోలేదు. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఫోన్‌ చేయించి, ‘ఇలాంటివి మంచిది కాదు. తిరిగి ఇచ్చేయండి’ అని చెప్పించాను. ఒకవేళ నేను నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఉంటే, గొడవ పెద్దది అయ్యేది. అనవసరంగా ఎందుకని ఊరుకున్నా. మాకు సంబంధించి సోషల్‌మీడియాలో వచ్చే వార్తలు, పోస్టులను మా టీమ్‌ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. అలా మే 18న ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చూశాను. ‘కన్నప్ప మూవీ హార్డ్‌ డ్రైవ్‌ లీక్‌ అయింది. అది మనోజ్‌ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటి’ అన్నది ఆ పోస్ట్‌ సారాంశం. ఈ విషయమై పోలీసులను సంప్రదిస్తే, ‘మీరు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయండి. మేము యాక్షన్‌ తీసుకుంటాం’ అని చెప్పారు. అంతకు ముందే వారం కిందట నాన్నగారికి విషయం చెప్పాను. ఆయన ఎంతో బాధపడ్డారు. మనోజ్‌పేరు బయటకు తీసుకురాకూడదని మేము అనుకున్నాం. కానీ త్వరలోనే బయటకు వస్తుంది. ‘అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురాకపోయినా ఫర్వాలేదు. చెడ్డపేరు మాత్రం తీసుకురాకూడదు’ అన్నది నా ఫిలాసఫీ”

లీక్‌ సన్నివేశాలను ఎవరూ ప్రోత్సహించవద్దు

”సరే.. ఏదైతే అది అయిందని కేసు ఫైల్‌ చేశాం. అలా ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న వీడియో 70 నిమిషాల ఫుటేజ్‌. దానిపై నాలుగు కంపెనీలు పనిచేశాయి. అది కేవలం వీఎఫ్‌ఎక్స్‌ పనులకు సంబంధించి డేటా మాత్రమే. సినిమాకు సంబంధించిన పూర్తి సన్నివేశాలు అందులో లేవు. వీఎఫ్‌ఎక్స్‌లో ఒక భాగం మాత్రమే. పైగా దానికి పాస్‌వర్డ్‌ ఉంది. ఏ పాస్‌వర్డ్‌ అయినా 100శాతం సేఫ్‌ కాదు. కానీ, 99శాతం ఎవరూ క్రాక్‌ చేయలేరు. ఒకశాతం మీద అనుమానం ఉంది. ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్‌ అయితే, దయచేసి ఆన్‌లైన్‌లో ఎవరకూ చూడొద్దని అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అది కొన్ని వందల మంది కష్టం. ఆ సన్నివేశాలు లీక్‌ కాకూడదని అనుకుంటున్నా. ఒకవేళ లీకైనా ఎవరూ దానిని ప్రోత్సహించవద్దు. సినిమా ప్రేమికుల కోసం జూన్‌ 27న ‘కన్నప్ప’ వస్తుంది. థియేటర్‌లో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి” అని మంచు విష్ణు కోరారు.

చరిత్రలో ఆధారాలు ఉన్నాయి

‘నోటితో నీటిని తీసుకుని శివునికి అభిషేకం చేయడంపై శివ భక్తుల నుంచి అభ్యంతరాలు రాలేదా’ అని విలేకరులు ప్రశ్నించగా, అందుకు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. ‘చరిత్రలో జరిగినదే మేం సినిమాలో పెట్టాం. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి. శివుడిని ‘కన్నప్ప’ అలా పూజించాడని ధూర్జటి రెండు పద్యాలు ద్వారా చెప్పారు” అని విష్ణు సమాధానం ఇచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.