కడుపునిండా భోజనం చేయాలంటే రుచికరమైన కూరలు చేయాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది వివిధ రకాల కూరగాయలతో కూరలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇంట్లో తగినన్ని కాయగూరలు ఉండవు. దీంతో ఏం కూర చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకోండి. అద్దిరిపోతుంది. దీనికోసం కేవలం 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు సరిపోతాయి. పైగా పచ్చిమిర్చి అవసరం లేదు. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే ఈజీగా ఆ రోజు గడిచిపోతుంది. కేవలం రైస్‌లోకి మాత్రమే కాకుండా టిఫెన్స్, చపాతీ వంటి వాటిల్లోకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- ఉల్లిపాయలు – 3(పెద్దవి)
- టమాటాలు – 2
- నూనె – 1 టేబుల్‌స్పూన్
- శనగపప్పు – 1 టేబుల్‌స్పూన్
- మినప్పప్పు – 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు – పావు టేబుల్‌స్పూన్
- జీలకర్ర – 1 టీస్పూన్
- కరివేపాకు – 2 రెమ్మలు
- ఉప్పు – సరిపడా
- కారం – సరిపడా
- చింతపండు – కొద్దిగా
- పసుపు- పావు టీస్పూన్
- కొత్తిమీర – అర కట్ట
- వెల్లుల్లి రెబ్బలు – 6
-
తాలింపు కోసం:
- నూనె – 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు – అర టీస్పూన్
- మినప్పప్పు – అర టీస్పూన్
- జీలకర్ర – అర టీస్పూన్
- శనగపప్పు – అర టీస్పూన్
- ఎండుమిర్చి – 2
- కరివేపాకు – 2 రెమ్మలు
-
తయారీ విధానం:
- పచ్చడికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి.
- శనగపప్పు సగం మేర ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి వాటిని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకుని వాటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో కొద్దిసేపు మగ్గించుకోవాలి.
- ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, కారం, పసుపు, చింతపండు వేసి కలిపి మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి.
- ఇవి మగ్గిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి మరో రెండు నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి ముందుగా ఫ్రై చేసిన శనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఓ బౌల్లోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- చివరగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పచ్చడిలో కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఉల్లిపాయ, టమాటా పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
-
చిట్కాలు:
- ఈ పచ్చడిలో ఎండు కారం వేసుకున్నాం. దానిని మీ రుచికి తగినట్లుగా వేసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే శనగపప్పుతో పాటే వీటిని వేయించి తీసుకోవాలి.
- ఈ పచ్చడిలో కొత్తిమీర ఆప్షనల్ మాత్రమే. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు.
- ఈ పచ్చడిలోకి సన్నగా తరిగిన ఆనియన్స్‌ను వేసుకుని తింటే రుచి మరింత బాగుంటుంది.
































