మన రోజు మొత్తం యాక్టివ్ గా ఉండాలంటే పొద్దున్నే మనం ఏం తింటున్నామనేది చాలా ముఖ్యం. అల్పాహారం.. రోజులో చాలా ముఖ్యమైన భోజనం. ఇది శరీరానికి శక్తిని అందించి, రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. భారతీయ సంప్రదాయంలో అనేక రకాల అల్పాహార వంటకాలు ఉన్నప్పటికీ, ఇడ్లీ చాలా ప్రాచుర్యం పొందింది. ఇది తేలికగా, జీర్ణమవడానికి సులువుగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే, ఓట్స్ ఇడ్లీ సాధారణ ఇడ్లీకి ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం, ఇది పోషకాలతో నిండి ఉంటుంది.
సాధారణ ఇడ్లీలో బియ్యం, మినపప్పు ప్రధానంగా ఉంటాయి. కానీ ఓట్స్ ఇడ్లీలో ఓట్స్ ప్రధానంగా ఉండటం వల్ల ఇది ఫైబర్, ప్రొటీన్, ఇతర సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిదని చెబుతుంటారు. దీనిని ఎలాంటి నానబెట్టుడులు అవసరం లేకుండా సింపుల్ గా అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు. ఓట్స్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఓట్స్ ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు -పెరుగు -ఓట్స్ -వంట సోడా -బొంబాయి రవ్వ -కొత్తిమీర -క్యారెట్ -క్యాప్సికమ్ -ఉప్పు -బీన్స్ -అల్లం -పచ్చిమిర్చి
ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం -ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు(100-110 గ్రాములు)ఓట్స్ వేసి తక్కువ మంటమీద బాగా వేయించుకోవాలి.
-పట్టుకుంటే క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఓట్స్ ని చల్లారనివ్వాలి. -చల్లారిన తర్వాత ఓట్స్ ను మిక్సీ గిన్నెలో వేసి రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా చేసుకోవద్దు. -ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసి తక్కువ మంటమీద మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి. -తర్వాత మిక్సీ గిన్నెలో రెండు పచ్చిమిర్చి ముక్కలు, అర ఇంచు అల్లం తరుగు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. -ఇప్పుడు ఓ గిన్నె తీసుకొని అందులో బరకగా గ్రైండ్ చేసిన ఓట్స్ వేసి ఇందులోనే గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ తరుగు, 1 ఫ్రెంచ్ బీన్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, వేయించిన బొంబాయి రవ్వ, అరకప్పు చిక్కని పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. -బాగా కలిపిన తర్వాత ఇందులో అరచెంచా వంటసోడా కలిపి దీన్ని అరగంట సేపు పక్కనపెట్టకోండి. -అరగంట తర్వాత అవసరమైతే కొద్దిగి నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండిలా ఉండేలా చూసుకోండి. -ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని ఇడ్లీలను చేసుకోవడమే. అంతే ఓట్స్ ఇడ్లీ రెడీ. దీనిని ఓ ఏట్నీ చట్నీ లేకున్నా ఒట్టి ఇడ్లీ తిన్నా అద్భుతంగానే ఉంటది.
































