మెజార్టీ పీపుల్ ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్‌లో ఒకటి పకోడీ. నార్మల్‌గా పకోడీ అనగానే ఎక్కువ మంది శనగపిండి, ఉల్లిపాయతో కలిసి ఆనియన్ పకోడీ చేసుకుంటుంటారు. అదే కాస్త వెరైటీగా తినాలనుకున్నప్పుడు ఆలూ, చికెన్, మొక్కజొన్న, క్యాబేజీ వంటి వాటితో ట్రై చేస్తుంటారు. అలాకాకుండా ఎప్పుడైనా బజ్జీలకు వాడే మిర్చితో పకోడీని చేసుకున్నారా? లేదు అంటే మాత్రం ఓసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి మంచి రుచితో నోరూరిస్తాయి. అలాగే, వీటిని చేసుకోవడం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోనే క్విక్ అండ్ ఈజీగా ఈ పకోడీని తయారు చేసుకోవచ్చు. అంటే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతాయి! మరి, ఈ సూపర్ టేస్టీ పకోడీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- బజ్జీ మిరపకాయలు – 120 గ్రాములు
- శనగపిండి – ముప్పావు కప్పు
- బియ్యప్పిండి – పావు కప్పు
- వాము – ఒకటీస్పూన్
- కారం – అరటీస్పూన్
- సన్నని ఉల్లిపాయ తరుగు – ముప్పావు కప్పు
- ఉప్పు – రుచికి తగినంత
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- కరివేపాకు తరుగు – కొంచెం
- బేకింగ్ సోడా – చిటికెడు
తయారీ విధానం :
- ఈ సింపుల్ స్నాక్ రెసిపీ ప్రిపేర్ కోసం ముందుగా బజ్జీ మిర్చిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఆపై ఒక్కో మిర్చిని మధ్యలోకి రెండుగా చీల్చి చిన్న చిన్న ముక్కలుగా(ఫొటోలో చూపిస్తున్న విధంగా) కట్ చేసుకోవాలి.
- ఆవిధంగా అన్నింటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీరు గింజలు వద్దనుకుంటే అవి తీసేసి కట్ చేసుకోవచ్చు.
- అలాగే, రెసిపీలోకి కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండిని తీసుకొని ఆపై అందులో బియ్యప్పిండి, వాముని చేతితో నలిపి వేసుకోవాలి.
- అలాగే, కారం, రుచికి తగినంత ఉప్పు, సన్నని ఉల్లిపాయ తరుగు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చి తరుగు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలపాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా వేసుకుంటూ బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. అయితే, పిండి అనేది మరీ లూజుగా, గట్టిగా ఉండకుండా చూసుకోవాలి.
- ఆవిధంగా సిద్ధం చేసుకున్నాక పిండిని చేతితో వన్‌సైడ్ డైరెక్షన్లో తిప్పుతూ రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.
- ఇలా చేయడం ద్వారా పకోడీ గట్టిగా రాకుండా లోపల గుల్లగా, సాఫ్ట్‌గా చాలా బాగా వస్తుందని గుర్తుంచుకోవాలి.
- అనంతరం ఆ పిండి మిశ్రమంలో కొత్తిమీర, కరివేపాకు తరుగు, వంటసోడా వేసుకొని మరోసారి పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండా మాదిరిగా వేసుకోవాలి.
- పాన్‌లో సరిపడా వేసుకున్నాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, నోరూరించే కమ్మని “బజ్జీ మిర్చి పకోడీ” రెడీ!
- తర్వాత వీటిని వేడివేడిగా నేరుగా తినేయొచ్చు. లేదంటే టమాటా కెచప్‌లో డిప్ చేసుకొని తిన్నా ఎంతో రుచికరంగా ఉంటాయి.
టిప్స్ :
- ఈ రెసిపీలో కాస్త బియ్యప్పిండిని వేసుకోవడం ద్వారా పకోడీ పైన కొంచం క్రిస్పీగా వచ్చి మంచి రుచికరంగా ఉంటుంది.
- ఒకవేళ మీరు తీసుకున్న బజ్జీ మిరపకాయలు కాస్త కారం ఉన్నట్లయితే ఇందులో ఎండుకారాన్ని చూసి వేసుకోవాలి.
































