మీరు రైలు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా? ఈ ప్లాట్‌ఫామ్‌లను ప్రయత్నించండి.

వెయిటింగ్ లిస్ట్, RAC టికెట్ల సమస్యను పరిష్కరించడానికి మేక్‌మైట్రిప్ (MakeMyTrip), ఇక్సిగో (Ixigo), రెడ్‌బస్ (Redbus) వంటి ప్రైవేట్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ కొత్త బుకింగ్ పాలసీని తీసుకొచ్చాయి.

రైల్వే టికెట్ బుకింగ్‌లో ఎక్కువ మంది ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యల్లో వెయిటింగ్ లిస్ట్, RAC ఒకటి. ఇలాంటి టికెట్‌తో ట్రావెల్ చేసేవారికి రైలు మొదలయ్యే వరకు ఒక టెన్షన్ ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే మరి కొంతమంది ప్రత్యామ్నాయ ట్రావెల్ మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ, వాటికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.


ఇలాంటి వెయిటింగ్ లిస్ట్, RAC టికెట్ల సమస్యను పరిష్కరించడానికి మేక్‌మైట్రిప్ (MakeMyTrip), ఇక్సిగో (Ixigo), రెడ్‌బస్ (Redbus) వంటి ప్రైవేట్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ కొత్త బుకింగ్ పాలసీని తీసుకొచ్చాయి. ‘ట్రావెల్ గ్యారంటీ’ ఫీచర్ పేరుతో టికెట్‌ని బుక్ చేసి ఇస్తున్నాయి. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే కస్టమర్లకు టికెట్ రేటుకు మూడింతల ఫీజు చెల్లిస్తున్నాయి.

ట్రావెల్ గ్యారంటీ ఫీచర్:
కస్టమర్లకు ప్రీమియం టికెట్ ధర ఆఫర్ చేసి వెయిటింగ్ లిస్ట్ లేదా RAC కోటాలోని రైల్వే టికెట్లను కచ్చితంగా బుక్ చేసి ఇవ్వడమే ఈ ట్రావెల్ గ్యారెంటీ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ రైల్వే టికెట్‌లను బుక్ చేసుకోవడానికి ముందుగా కొంత డబ్బు చెల్లించాలి. వీలైనంత మేరకు సీట్ బుక్ అవుతుంది. ఒకవేళ సీట్ బుక్ కాకపోతే కస్టమర్లు చెల్లించిన టికెట్ ధరకు 3 రెట్లు అమౌంట్ రీఫండ్ ఇస్తాయి. ట్రావెల్ వోచర్స్ రూపంలో ఎడిషనల్ అమౌంట్ అందుకోవచ్చు.

ఎలాగంటే?
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ బుకింగ్ గురించి చూద్దాం. ఉదాహరణకు, న్యూఢిల్లీ నుంచి హౌరాకు వెళ్లే హౌరా రాజధాని‌లో 3AC కోచ్‌లో బుక్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తున్నారని అనుకుందాం. అయితే, మీ కన్నా ముందు 20 మంది ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇక్సిగో (Ixigo) లోకి వెళ్లి ముందుగా ట్రావెల్ గ్యారంటీ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత ట్రావెల్ గ్యారంటీ ఫీజు కింద ఇక్సిగో రూ.1,389 వసూలు చేస్తోంది. ఈ రూట్‌లో టికెట్ ధర రూ.3,020ను చెల్లించాలి.

ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయ్యే లోగా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదా, మీ టికెట్ ధర రూ. 3020కు 3 రెట్లు అంటే రూ. 9060 మీకు రీఫండ్ అవుతాయి. ఇందులో టికెట్ ధర రూ.3020 నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. మిగతా అమౌంట్ ట్రావెల్ ఓచర్‌లో యాడ్ అవుతుంది.

RAC టికెట్ బుకింగ్
RAC టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ట్రావెల్ గ్యారంటీ ఫీచర్‌ని ఉపయోగించుకునే ఫెసిలిటీని రెడ్‌బస్ అందిస్తోంది. ఇందుకు రూ. 787 చెల్లించాలి. ఉదాహరణకు, ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే రైలులో RAC టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటే బుకింగ్ కోసం టికెట్ ధర రూ.1,785 చెల్లించాలి. ఒకవేళ బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే టికెట్ ధరతో పాటు అదనంగా రూ.3,570 ట్రావెల్ వోచర్‌గా పొందవచ్చు.

ఏయే ప్లాట్‌ఫారంలో ఎలా?
న్యూఢిల్లీ నుంచి హౌరా వరకు కోల్‌కతా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 3AC కోచ్‌లో టికెట్‌ బుక్ చేయాలని అనుకుంటున్నారు. వెయిటింగ్ లిస్ట్ 22గా ఉందని అనుకుందాం. ఇప్పుడు ట్రావెల్ గ్యారంటీ ఫీచర్ కింద ఇక్సిగో రూ.1,449, రెడ్‌బస్ రూ.1,389, మేక్ మై ట్రిప్ రూ.1,350 వసూలు చేస్తున్నాయి.

ఇది జిమ్మిక్కా?
ఈ సంస్థలు PNR మూవ్‌మెంట్ ప్యాటర్న్స్, ట్రైన్ స్పెసిఫిక్ కన్ఫర్మేషన్ ట్రెండ్స్, సీజనల్ బుకింగ్ బిహేవియర్ వంటి హిస్టారికల్ డేటాసెట్స్‌ అనలైజ్ చేసి టికెట్ కన్ఫర్మేషన్‌ని కచ్చితంగా అంచనా వేస్తుంటాయి. ఉదాహరణకు, రోజుకు IRCTC దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి రైలు టిక్కెట్ల బుకింగ్‌లను ప్రాసెస్ చేస్తుంది. ఇక్సిగో, రెడ్‌బస్, మేక్‌మైట్రిప్ వంటి ప్లాట్‌ఫారంలు కలిసి అందులో కేవలం 10% మాత్రమే – అంటే రోజుకు దాదాపు 10 లక్షల టిక్కెట్లు కలిగి ఉన్నాయని అనుకుందాం. ఇందులో 5 శాతం మంది అంటే 50 వేల మంది రూ.30 ప్రీమియంతో ట్రావెల్ గ్యారంటీని ఎంచుకుంటే రోజుకు రూ.15 లక్షల ఆదాయం వస్తుంది.

వెయిట్‌లిస్ట్ టిక్కెట్లలో 1–2% మాత్రమే కన్ఫర్మ్ కావని చారిత్రక డేటా సూచిస్తోంది. కాబట్టి, రోజుకు 2,000 క్లెయిమ్‌లు ఒక్కొక్కటి రూ. 300 చొప్పున చెల్లించినప్పటికీ అది రూ. 6 లక్షల ఖర్చు అవుతుంది. అంటే, మిగతా రూ. 9 లక్షల మార్జిన్‌ కంపెనీలకు మిగులుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.