రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నాడు?

శ్రీను వైట్ల..ఒకప్పుడు ఆయన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో సినిమా వచ్చిందంటే బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది.


కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఆ చిత్రం తర్వాత తెరకెక్కించిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు ఆయన మెగాఫోన్‌ పట్టలేదు. చాలా కాలం తర్వాత ‘విశ్వం’తో మళ్లీ తిరిగి వచ్చాడు. గోపీచంద్‌ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ శ్రీను వైట్ల రీఎంట్రీకి పనికొచ్చింది.త్వరలో ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. శ్రీను వైట్ల పర్సనల్‌ విషయం ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఆయన బాగా రిచ్‌ అట. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 2000 కోట్ల వరకు ఉంటుందనే వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా దీనిపై శ్రీనువైట్ల స్పందించారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రూ. 2000 కోట్ల అధిపతి అన్న మాట అవాస్తవం. అంత రిచ్చెస్ట్‌ డైరెక్టర్‌ని నేను కాను. కానీ ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలపై వచ్చిన డబ్బుతో నేను భూములు కొన్నాను. వాటి రేట్‌ ఇప్పుడు బాగానే పెరిగింది. నాకు ఇతర అలవాట్లేవి లేదు. సినిమాలు తీయడం తప్ప వేరే ఏ పని రాదు. స్థలాల మీద తప్ప నాకు వేరే నాలెడ్జ్ లేదు. అందుకే వాటిమీదనే ఇన్వెస్ట్ చేశాను. పొలాలు కొన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.

ఇక డబ్బుల విషయంలో చాలా పొదుపరి అట కదా అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నిజమే డబ్బుల విషయంలో నేను కాస్త జాగ్రత్తగానే ఉంటాను. అలా అని పిసినారిని కాదు. అవసరం మేరకు ఖర్చు చేస్తాను. డబ్బు కన్నా ఎక్కువ సినిమాకే ఇంపార్టన్స్‌ ఇస్తాను. నా వల్ల ఇప్పటి వరకు ఏ నిర్మాత నష్టపోలేదు. డిజాస్టర్‌గా నిలిచిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలోనూ నిర్మాతలు నష్టపోలేదు. నా డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో.. నిర్మాత విషయంలోనూ అలానే ఉంటాను. చెప్పిన దానికంటే తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను ముగిస్తాను’ అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.